మంగ మోహన్‌గౌడ్ వైపు అధిష్టానం చూపు
నామినేటెడ్ పదవి కోసం ఎదురుచూపులు
సీనియర్ల జాబితాలో మోహన్‌గౌడ్ పేరు
తెలంగాణ ప్రభ (ఉమ్మడి మెదక్ బ్యూరో): నాలుగు దశాబ్ధాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కరుడుగట్టిన కార్యకర్త...గల్లీ నుంచి ఢిల్లీ పెద్దల వరకు పరిచయాలు ఉన్నా పదవుల కోసం పాకులాడలేదు..క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా...అజాతశత్రువుగా పేరుపొందిన అతనికి ఇతర పార్టీల నుంచి ఉన్నతమైన పదవులు ఇస్తామని ఆఫర్లు వచ్చినా నమ్మిన సిద్దాంతం కోసం పార్టీనే నమ్ముకున్న వ్యక్తికి మెదక్ పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మంగ మోహన్‌గౌడ్. పార్టీలో పనిచేస్తూ 45 సంవత్సరాలుగా ఒక్క నామినేటెడ్ పదవికి నోచుకోకుండా జీవితాన్ని పార్టీకి అంకితం చేసిన మోహన్‌గౌడ్‌కు ఈసారైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవి లభిస్తందా అని అతని అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. గత పది సంవత్సరాలుగా ప్రతిపక్ష పార్టీ నాయకునిగా ఉంటూ పార్టీ నిర్వహించిన అనేక కర్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టడంతో కనీసం ఈసారైనా నామినేటెడ్ పోస్టు లభిస్తుందని ఆశిస్తున్నారు.
మంగ మోహన్‌గౌడ్ రాజకీయ ప్రస్థానం..:
మెదక్ పట్టణానికి చెందిన మంగ మోహన్‌గౌడ్ విద్యార్థి దశ నుండే యువజన కాంగ్రెస్ బ్యానర్‌పై మెదక్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి సంఘ ఉపాధ్యక్షునిగా 1978 నుండే ప్రస్థానం మొదలుపెట్టారు. అప్పటి నుండి ఉమ్మడి మెదక్ జిల్లా ఎన్ఎస్‌యుఐ వ్యవస్థాపక అధ్యక్షునిగా పార్టీ బలోపేతానికి కృషి చేశారు. మెదక్ ఎంపీ స్థానానికి పోటీ చేసిన స్వర్గీయ ఇందిరాగాంధీ నుండి మొదలుకొని అనేక మంది నేతల గెలుపు కోసం పాటుపడ్డారు. స్వర్గీయ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రియ శిష్యునిగా గుర్తింపు పొంది ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తనవంతు పాత్ర పోషించారు. అప్పటి నుండి ఎన్నో పర్యాయాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఎవరివద్ద సిఫారసు చేసుకోకుండా నామినేట్ పదవులు పొందలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలో సైతం పార్టీలో చేరాలని ఒత్తిడి వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాల్లో పాలుపంచుకున్నారు.
అధిష్టానం గుర్తించేనా..?
నాలుగు దశాబ్ధాలుగా పార్టీకి సేవలందించిన మంగ మోహన్‌గౌడ్ సేవలకు ప్రతిఫలంగా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తింపునిస్తుందా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం నడుస్తున్నందున పార్టీలో కష్టపడిన వారికి పదవులు తప్పకుండా దక్కుతాయని ప్రకటించడంతో పలు నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా నుండి మంగ మోహన్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతగా గుర్తింపు పొందినందున ఈసారి ఎలాగైనా అతనికి నామినేటెడ్ పోస్టు లభిస్తుందని కార్యకర్తలు, నాయకులు ఆశిస్తున్నారు. మెదక్ యువ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్‌రావు గెలుపుకోసం అహర్నిశలు కష్టపడ్డానని, అధిష్టానం తన సేవలను గుర్తిస్తుందన్న నమ్మకంతో మంగ మోహన్‌గౌడ్ ఉన్నారు. మరి ఈసారైనా అతనికి అవకాశం దక్కతుందో లేదో వేచి చూడాల్సిందే.
