మెద‌క్ ఎంపీ పీఠానికి పెరిగిన పోటీ

ప్ర‌ధాన పార్టీల నుండి భారీగా ఆశావాహుల ద‌ర‌ఖాస్తులు

అధిష్టానాల చూపు ఎవ‌రివైపో ?

తెలంగాణ ప్ర‌భ (ఉమ్మ‌డి మెద‌క్ బ్యూరో): అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత త్వ‌ర‌లో జ‌రిగే లోక్‌స‌భ ఎన్నిక‌ల‌పై అన్ని రాజ‌కీయ పార్టీలు దృష్టి పెట్టాయి. ఇందుకోసం ఆయా పార్టీలు స‌న్న‌ద్ద‌మ‌వుతున్నాయి. ఇందుకోసం బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దింపాల‌నే ఆలోచ‌న‌లో ఆయా పార్టీల అధిష్టానాలు యోచిస్తున్నాయి. ఉమ్మ‌డి  మెద‌క్ జిల్లాలో మెద‌క్‌, జ‌హీరాబాద్ పార్ల‌మెంట్ స్థానాలు ఉన్నాయి. ముఖ్యంగా మెద‌క్ ఎంపీ స్థానంపై ప్ర‌ధాన పార్టీలో ప్ర‌త్యేక దృష్టి పెట్టాయ‌ని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఎంపీ ఎన్నిక‌ల్లో సైతం విజ‌య‌ఢంకా మోగించాల‌ని చూస్తుండ‌గా, సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవ‌సం చేసుకోవాల‌ని బీఆర్ఎస్ అధిష్టానం ప్ర‌య‌త్నాలు సాగిస్తుంది. మ‌రోవైపు కేంద్రంలో తిరిగి అధికారం మ‌ళ్ళీ బీజేపీదే అన్న ధీమాలో ఉన్న ఆ పార్టీ నేత‌లు బ‌ల‌మైన అభ్య‌ర్థిని నిల‌బెట్టేందుకు కార్యాచ‌ర‌ణ రూపొందిస్తుంది. ఇందుకు క్షేత్ర స్థాయిలో ఆయా పార్టీల కేడ‌ర్ అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటున్నాయి. దీంతో ఆయా పార్టీల నుండి మెద‌క్ ఎంపీ స్థానానికి ఆశావాహుల సంఖ్య భారీగానే పెరుగుతోంది. మెద‌క్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో మెద‌క్‌, న‌ర్సాపూర్‌, సిద్దిపేట‌, గ‌జ్వేల్‌, దుబ్బాక‌, సంగారెడ్డి, ప‌టాన్‌చెరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మెద‌క్ పార్ల‌మెంట్ స్థానంలో మెద‌క్ మిన‌హాయిస్తే ఆరింట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుపొంద‌గా మెద‌క్‌లో మాత్రం కాంగ్రెస్ గెలుపొందిన విష‌యం తెలిసిందే. 

బీఆర్ఎస్‌లో కేసీఆర్‌దే తుది నిర్ణ‌యం...:

మెద‌క్ పార్ల‌మెంట్ స్థానం నుండి గ‌త మూడు ప‌ర్యాయాలు ఆనాటి టీఆర్ఎస్ అభ్య‌ర్థులే గెలుపొందారు. 2008 నుండి వ‌రుస‌గా గెలుపొందిన బీఆర్ఎస్ ఈసారి కూడా సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ప‌ట్టుద‌ల‌తో ఉంది. మెద‌క్ పార్ల‌మెంట్ స్థానంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల‌లో ఆరు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దీంతో గెలుపుపై ప‌క్కా ధీమాతో ఆ పార్టీ నేత‌లు ఉన్నారు. ఈ స్థానం నుండి న‌ర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే సిహెచ్‌.మ‌ద‌న్‌రెడ్డి, ఎమ్మెల్సీ వెంక‌ట్రాంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్‌.స‌త్య‌నారాయ‌ణ‌, ప‌టాన్‌చెరువుకు చెందిన గాలి అనిల్ కుమార్‌, సంగారెడ్డికి చెందిన బీర‌య్య యాద‌వ్ పోటీ ప‌డుతున్న వారిలో ఉన్నారు. కాగా అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో న‌ర్సాపూర్ సిట్టింగ్ టికెట్‌ను మ‌ద‌న్‌రెడ్డికి ఇవ్వ‌క‌పోవ‌డంతో మెద‌క్ ఎంపీ టికెట్టు ఇస్తామ‌ని కేసీఆర్ హామీనిచ్చారు. ఇలావుండ‌గా మెద‌క్ ఎంపీగా ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల  క‌విత పేరు కూడా జోరుగా వినిపిస్తోంది. ఒక‌వేళ వీరెవ‌రికీ కాకుండా స్వ‌యంగా మాజీ సీఎం కేసీఆర్ పోటీ చేసే అవ‌కాశాలు కూడా లేక‌పోలేద‌ని భావిస్తున్నారు. 

కాంగ్రెస్ పార్టీలో పోటీ ఎక్కువే...:

మెద‌క్ ఎంపీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున స్వ‌ర్గీయ ప్ర‌ధాని ఇందిరాగాంధీ పోటీ చేసి గెలుపొందిన విష‌యం తెలిసిందే. ఈసారి ఎలాగైనా గెలుపొందాల‌నే ధీమాతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్ప‌టికే ఈ స్థానానికి 11 మంది ఆశావ‌హులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. వీరిలో ప్ర‌ధానంగా మ‌ల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి, పీసీసీ అధికార ప్ర‌తినిధి భ‌వానీరెడ్డి,  దుబ్బాక చెరుకు శ్రీ‌నివాస్‌రెడ్డి, మ‌ద్దుల సోమే!శ్వ‌ర్‌రెడ్డితో పాలు ప‌లువురు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ప్ర‌ధానంగా మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు, జ‌గ్గారెడ్డి పేర్లు బ‌లంగా వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలోని ఆయా పార్టీల నేత‌ల‌ను కాంగ్రెస్‌లో చేర్పించే ప‌నిలో ప‌డ్డారు. అంతేగాకుండా ఇటీవ‌ల రెండువేల కార్ల‌తో సిద్దిపేట‌లో స‌మావేశం సైతం నిర్వ‌హించారు. అయితే అధిష్టానం మాత్రం ఎవ‌రికి టికెట్ ఇస్తుందో వేచిచూడాల్సిందే. 

అభిప్రాయాలు సేక‌రించిన బీజేపీ...:

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలో భంగ‌ప‌డ్డ బీజేపీ పార్టీ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని యోచిస్తోంది. మెద‌క్ ఎంపీ స్థానానికి బ‌ల‌మైన అభ్య‌ర్థిని నిల‌బెట్టేందుకు క‌స‌ర‌త్తు ప్రారంభించింది. ఆయా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌మావేశాలు ఏర్పాటు చేసి కేడ‌ర్ అభిప్రాయాల‌ను సేక‌రించింది. ఈ మేర‌కు అధిష్టానానికి నివేదిక అంద‌జేసిన‌ట్లు స‌మాచారం. ముఖ్యంగా బీజేపీ నుండి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్‌రావు, మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌, గ‌జ్వేల్‌కు చెందిన ఆకుల రాజ‌య్య‌, సంగారెడ్డికి చెందిన న‌రేంద‌ర్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు.

.