ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి : మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా

తెలంగాణ ప్రభ (మెదక్): ఈనెల 28 నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో ఇంటర్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ రమేష్ తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ అత్యంత జాగరూకతతో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని, ఏ చిన్న పొరపాటు జరిగినా విద్యార్ధుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని అన్నారు. 

పరీక్షలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రంలోకి  చేరుకోవాలని,ఒక నిముషం ఆలస్యం అయితే పరీక్ష కేంద్రం లోకి అనుమతి లేదన్నారు.

ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై సమీక్షిస్తూ ఫిబ్రవరి 28 నుండి మార్చ్ 19 వరకు ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు జరిగే పరిక్షలకు జిల్లాలో 13,173 మంది విద్యార్థులు హాజరవుతున్నారని, ఇందులో మొదటి సంవత్సరంలో 6,507మంది విద్యార్థులు, రెండవ సంవత్సరంలో 6666 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని అన్నారు.. ఇందుకోసం 30 కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ప్రతి కేంద్రంలో సి.సి.కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, 30 చీఫ్ సూపరింటెండెంట్లు. 30 శాఖాధికారులతో పాటు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్, 4 సిట్టింగ్ స్క్వాడ్, 5 కస్టడీయ్సన్ టీములు ఏర్పాటు చేశామని వీరు పరీక్షల నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని అన్నారు. ప్రశ్న పత్రాల స్టోరేజికి 14 పాయింట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని, పరీక్షా సమయంలో జిరాక్స్ సెంటర్లు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్ధులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు హాజరయ్యేలా ఆర్టీసీ అధికారులు బస్సులను నడపాలని, వైద్య అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులతో మెడికల్ పాయింట్ ఏర్పాటుl చేయాలని, విద్యుత్  అంతరాయo కలుగకుండా చూడాలని విద్యుత్ శాఖాధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సత్యనారాయణ, డీఈఓ రాధాకిషన్, శశిధర్, అశోక్, పోలీస్, పోస్టల్, ఆర్టీసీ, విద్యుత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

.