మిల్లర్ల అలసత్వాన్ని సహించం
ఈనెల 29లోపు చివరి గడువు
మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా
తెలంగాణ ప్రభ ( మెదక్ ): జిల్లాలో అధిక శాతం సీఎంఆర్ పెండింగ్ ఉన్న మిల్లుల యాజమాన్యాలతో మిల్లుల వారీగా శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ధేశించిన గడువు ఫిబ్రవరి 29 వరకు అవకాశం ఇచ్చిందని, అప్పటిలోగా బియ్యం పెట్టని మిల్లుల యజమానులపై ఆర్ఆర్ యాక్ట్ కింద స్థిర, చర ఆస్తులు జప్తు చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. నెలలు గడుస్తున్నా మిల్లర్లు అలసత్వాన్ని తీవ్రంగా పరిగణమిస్తామని కలెక్టర్ తెలిపారు. సీఎంఆర్ కేటాయింపులపై కూలంకషంగా చర్చించారు. రైతుల నుండి ప్రభుత్వ పరంగా కొనుగోలు చేసి సమకూర్చిన ధాన్యాన్ని వేగవంతంగా మిల్లింగ్ జరుపుతూ ఈ నెలాఖరులోగా నిర్దేశిత కోటాకు అనుగుణంగా కస్టమ్ మిల్లింగ్ రైస్ నిల్వలను భారత ఆహార సంస్థకు చేరవేయాలని రైస్ మిల్లర్లకు సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యానికి తావు కల్పిస్తూ, నిబంధనలను ఉల్లంఘించే రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు కూడా వెనుకాడబోమని కరాఖండీగా తేల్చిచెప్పారు. సీఎంఆర్ కేటాయింపుల్లో జాప్యాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నందున, ఇకపై మిల్లర్ల అలసత్వాన్ని తాము ఎంత మాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా గల అన్ని రైస్ మిల్లులలో తప్పనిసరిగా పూర్తి స్థాయి సామర్ధ్యానికి అనుగుణంగా కస్టమ్ రైస్ మిల్లింగ్ జరుపుతూ, ఈ నెలాఖరు లోపు ఎఫ్ సీ ఐ కి నిల్వలు చేరవేయాలని గడువు విధించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రమేష్ , సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ హరికృష్ణ, డీసిఎస్ఓ బ్రహ్మరావు, రైస్ మిల్లర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
.