తెలంగాణ ప్రభ, (కోనరావుపేట); కోనరావుపేట మండలం ధర్మారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వంటగది నిర్మాణం పనులు నిలిచిపోయాయి. రూ.3లక్షల 60 వేలు నిధులు వంటగది నిర్మాణానికి మంజూరు కాగా పనులను చేపట్టిన కాంట్రాక్టర్ 90 శాతం పనులు పూర్తిచేయగా , బిల్లులు రావడం లేదని పనులను ఆపేశాడు. దీంతో వంటగది లేక మిడ్ డే మీల్స్ కార్మికులు చెట్ల కిందనే వంట చేస్తున్నారు.ఇదంతా అధికారుల కళ్ళముందే జరుగుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఇదే కాంట్రాక్టర్ స్కూల్లో రూ.6లక్షలతో బాత్రూంలను నిర్మించిన బిల్లులు రావడం లేదని అధికారులు బిల్లులు మంజూరు చేయాలని లేదంటే బాత్రూమ్స్ కి తాళాలు వెస్తానంటున్నాడు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి కాంట్రాక్టర్కు రావాల్సిన బిల్లులు మంజూరు చేసి మిగిలిపోయిన వంటగది పనులను త్వరలో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
