మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

అధునాతన సౌకర్యాలతో నూతన భవనంలో భరోసా కేంద్రం ఏర్పాటు

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ  మంత్రి సి.దామోదర రాజనర్సింహ

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): ఈవ్ టీజింగ్ కు గురైన  అమ్మాయిలు, లైంగికంగా వేధించబడి నిరాధారణకు గురైన మహిళలకు,  గృహహింసకు గురైన మహిళల కోసం భరోసా కేంద్రాలు భరోసానిస్తాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సి.దామోదర్ రాజనర్సింహ తెలిపారు.  గురువారం ఆయన మెదక్ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన భరోసా కేంద్రం  భవనాన్ని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు తో కలిసి ప్రారంభించారు. అంతకుముందు ఆయన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి మంత్రి మాట్లాడారు.  రూ.2 కోట్ల రూపాయలతో నిర్మించిన జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రాన్ని "షీ" టీమ్   కార్యాలయాన్ని ప్రారంభించడం  జరిగిందన్నారు. ఈ భవనాన్ని 

మెదక్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్లాండ్ ఫార్మసి ఎస్ఆర్ ఫండ్స్ సౌజన్యంతో  నిర్మించినట్లు తెలిపారు. 2022 ఆగస్టు నుంచి ఇప్పటివరకు 135 కేసులు నమోదు  అయ్యాయని, వారికి సుమారు 27 లక్షల పైచిలుకు ఆర్థిక సహాయం చేశామన్నారు. కేసు నమోదు అయినప్పుడు ఆర్థిక సహాయం చేయలన్నారు. చివరగా జడ్జ్మెంట్ వచ్చినప్పుడు సంపూర్ణ ఆర్థిక మద్దతు ఇవ్వాలని పేర్కొన్నారు. మహిళా సంక్షేమమే  ప్రభుత్వ ధ్యేయం అన్నారు. భరోసా కేంద్రంలో శారీరకంగా, మానసికంగా, లైంగికంగా సమాజంలో వేధింపులకు గురైన, అత్యాచారాలకు గురైనా బాధితులకు తక్షణం అండగా నిలిచేందుకు, పోక్సో కేసులలో మహిళలకు, పిల్లలకు స్వాంతన చేకూర్చడానికి కౌన్సిలింగ్, రిహాబిలేషన్ సెంటర్ గా ఈ భరోసా కేంద్రం ద్వారా పోలీసులు, మానసిక కౌన్సిలింగ్ నిపుణులు ద్వారా బాధిత మహిళలకు, పిల్లలకు అండగా నిలిచేందుకు ఈ కేంద్రం దోహదపడుతుందన్నారు. భరోసా కేంద్రలు లేని  జిల్లాల్లో త్వరలో  ఏర్పాటు చేస్తాం అన్నారు. అనంతరం భరోసా కేంద్రంలో మంత్రి మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, డీఐజి రెమా రాజేశ్వరీ, జిల్లా ఎస్పీ బాలస్వామి , డిఏంఅండ్ హెచ్ఓ చందు నాయక్, జిల్లా సంక్షేమాధికారిణి  బ్రహ్మాజీ, మెదక్ తహసీల్దార్  శ్రీనివాస్,  గ్లాండ్ ఫార్మ  ప్రతినిధులు,   పోలీస్ ఉన్నతాధికారులు,  సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

.