ఆధునిక వ్యవసాయ సాంకేతిక పద్ధతులను అలవర్చుకోవాలి : మెదక్ కలెక్టర్ రాజర్షి షా

తెలంగాణ ప్రభ ( మెదక్ ): ఆధునిక వ్యవసాయ సాంకేతిక పద్ధతులను అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. కలెక్టర్ ఛాంబర్ లో బుదవారం అగ్రిటెక్ సౌత్ 2024 పోస్టర్ల ఆవిష్కరణ  చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా  మాట్లాడుతూ ఈనెల 16 నుండి 18 ఫిబ్రవరి 2024 ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నందు  భారత పరిశ్రమల సమాఖ్య వ్యవసాయ రంగంలో జరుగుతున్న సాంకేతిక అభివృద్ధిని రైతులకు పరిచయం చేయడానికి అగ్రీటెక్ సౌత్ - 2024 ఎగ్జిబిషన్ మరియు సదస్సు నిర్వహిస్తుందన్నారు.  

అగ్రీటెక్ సౌత్ 2024లో వ్యవసాయ ఉత్పత్తులు వాటి పెంపకం, పునరుత్పత్తి వ్యవసాయం, పశు సంరక్షణ, చేపల పెంపకం, కోళ్ల పెంపకం, ఆయిల్ ఫామ్ సాగు, వ్యవసాయ యాంత్రీకరణ, పోషక భద్రత, ఉద్యాన పంటలు, సమీకృత వ్యవసాయ పద్ధతులు, రైతు ఉత్పావన సంస్థలు, అగ్రీ స్టార్టప్ల గురించి చర్చలు జరుగుతాయన్నారు. ఆయా సంస్థల సాంకేతిక అభివృద్ధి ప్రదర్శన ఎగ్జిబిషన్లో జరుగుతాయన్నారు. మూడు రోజులపాటు నిర్వహించే ఈ ఎగ్జిబిషన్ నందు వెయ్యి మంది వ్యవసాయ సంబంధిత ప్రతినిధులతో చర్చ కార్యక్రమం 150 స్టాల్స్ వివిధ వ్యవసాయ ఉపకరణాలపై, రైతులకు అనుభవ కేంద్రంతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి రైతు సందర్శకులు పాల్గొంటారు. విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ రసాయనాలు, వ్యవసాయ పరికరాలు, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, సేంద్రియ వ్యవసాయం, వ్యవసాయంలో డిజిటల్ సాంకేతిక అంశాలపై రెండు రోజులపాటు కాన్ఫరెన్స్ లు నిర్వహించబడుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆసక్తి గల రైతులు స్వచ్చందంగా పాల్గొనాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, వ్యవసాయ సహాయ సంచాలకులు వినయ్ కుమార్, రాజ్ నారాయణ పాల్గొన్నారు.

.