అడవిపంది దాడిలో రైతు మృతి

-మరొకరికి తీవ్ర గాయాలు

తెలంగాణ ప్రభ (మెదక్): అడవి పంది దాడిలో ఓ రైతు మృతి చెందిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండలంలోని అజ్జమర్రి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ పన్యాల పోచయ్య తండ్రి పన్యాల శంకరయ్య (59) బుధవారం నాడు గ్రామ శివారులో పంట పొలం వద్దనున్న ముళ్ల చెట్లను తొలగించి సేదతిరి నీళ్ళు తాగుతుండగా పొదల్లో నుంచి వచ్చిన అడవి పంది ఒక్కసారిగా రైతు శంకరయ్య పై అమాంతం దాడి చేసింది. అది చూసిన స్థానికులు అడివి పందిని వెళ్లగొట్టగా అటుగా వెళుతున్న పంది మరో వ్యక్తి బేగరి బిక్షపతి(40) అతని పొలంలో పనిచేస్తుండగా వెనక నుండి వెళ్లి దాడి చేయడంతో బిక్షపతికి కూడా  గాయాలయ్యాయి.ఈ దాడిలో తీవ్ర గాయాలైన శంకరయ్యను స్థానికులు చికిత్స నిమిత్తం అంబులెన్సులో నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు, బేగరి బిక్షపతి స్వల్ప గాయాలవగా సంగారెడ్డి జిల్లా సిరిపురం ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శంకరయ్య మరణించారని వైద్యులు ధ్రువీకరించడంతో బంధువులు కన్నీరు మున్నిరయ్యారు. శంకరయ్య మరణవార్తతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

.