గ్రామీణ అభివృద్ధి సంస్థ బ్యాంక్ లింకేజీలో రాష్ట్రంలో మెదక్ ప్రథమ స్థానం : మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా

తెలంగాణ ప్రభ ( మెదక్ ): మెదక్ కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హల్ లో మంగళవారం జిల్లా బ్యాంకర్ల సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ 2023వ త్రై మాసికానికి సంబందించి జిల్లా గ్రామీణ అభివృద్ది సంస్థ వంద శాతం లక్ష్యం సాధించి, రాష్ట్రoలో ప్రథమ స్థానం రావడం జిల్లాకు గర్వకారణం అన్నారు. పట్టణ అభివృద్ది సంస్థ కూడా వంద శాతం లక్ష్యం సాధించిందన్నారు. మొత్తం రుణ ప్రణాళికలో వ్యవసాయ, వ్యాపార, ముద్ర, వీది విక్రేతలకు, మహిళ, యువతకు ఉపాధి కోసం రుణాలు పంపిణీ చేశామన్నారు. మొత్తం రుణ ప్రణాళికలో 3796.28 కోట్ల లక్ష్యానికి గాను 2874.32 కోట్ల లక్ష్యం సాధించి రాష్ట్రoలో ప్రథమ స్థానం రావడం గొప్ప విషయమన్నారు. అనంతరం  2024-2025 సంవత్సరానికి నాబార్డ్ బ్యాంక్ సౌజన్యంతో రూపొందించిన  "పోటేన్సియాల్ లింకుడ్ క్రెడిట్ ప్లాన్"  బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు, మెప్మా పిడి ఇందిరా, జిల్లా ఎస్సీ, ఎస్టీ అభివృద్ది శాఖ అధికారి విజయ లక్ష్మి, జిల్లా లీడ్ మేనేజర్ మూర్తి, జిల్లా లీడ్ అధికారి రెహ్మాన్, నాబార్డ్ డీడీఎం సేసిల్ తిమోతి, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ అరుణ జ్యోతి, ఏపీజీవీబీ రీజనల్ మేనేజర్ ఉదయ్ కిరణ్ ఇతర బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.

.