సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): 2024 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారందరినీ ఓటరుగా నమోదు చేయించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు సూచించారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈఆర్ఓలు, ఏఈఆర్వోలతో ఓటరు జాబితాపై వచ్చిన అభ్యంతరాలు, పరిష్కరణ, పోలింగ్ కేంద్రాల క్రమబద్దీకరణ, శుద్ధమైన ఓటరు జాబితా రూపకల్పన తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఎస్ఆర్ -2024 లో భాగంగా వచ్చే జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారందరినీ ఓటర్ జాబితాలో నమోదు చేయించాలన్నారు. జనవరి 6, 2024న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసి, జనవరి 22, 2024 వరకు అభ్యంతరాలను, క్లెయిమ్స్ ను స్వీకరించి, ఫిబ్రవరి రెండవ తేదీ లోగా పూర్తిస్థాయిలో పరిష్కరించి, ఫిబ్రవరి 8న తుది ఓటరు జాబితాను వెలువరించాలని తెలిపారు.
పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ చేయాలని, ఓటరు జాబితాలో ఇంకా డబుల్ ఓటర్లు, చనిపోయిన ఓటర్లు, శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్ల వివరాలుంటే ఓటర్ జాబితా నుండి తొలగించాలన్నారు. వంద సంవత్సరాలు పైబడిన వారి వివరాలను క్షేత్రస్థాయిలో విచారించాలని తెలిపారు.
1500కు మించి ఓటర్లు ఉన్నచోట అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు.
పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో ప్రతీ వారం సమావేశాలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో అందుబాటులో గల ప్రభుత్వ భూముల వివరాలు అందించాలని
రెవిన్యూ అధికారులకు సూచించారు.
జిల్లాలో మహాలక్ష్మి, చేయూత (రాజీవ్ ఆరోగ్యశ్రీ) పథకాల అమలు తీరుపై పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలని, ఆర్టీసీ డిఎం లతో సమీక్షించాలని, అన్ని ఆసుపత్రులను సందర్శించాలని రెవెన్యూ డివిజనల్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్ఓ నగేష్, రెవిన్యూ డివిజనల్ అధికారులు, ఆయా తహసిల్దార్లు, ఎన్నికల విభాగపు అధికారులు పాల్గొన్నారు.
.