సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): లారీ రూపంలో దూసుకు వచ్చిన మృత్యువు ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది... తన సోదరి ఇంటికి బయలుదేరిన ఆ కుటుంబ సభ్యుల ఇంట్లో తీవ్ర విషాదం అలముకుంది. అతివేగంగా వెనుక నుంచి వచ్చిన లారీ ముందున్న స్కూటీనీ ఢీకొట్టడంతో తల్లి, కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధి జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. సంగారెడ్డి రూరల్ సీ.ఐ సుధీర్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
విజయనగరం జిల్లా దిబ్బగూడ ప్రాంతానికి చెందిన కోటాన మహేశ్వరి (26) తన భర్త కోటాన సత్యనారాయణతో కలిసి సంగారెడ్డిలోని శాంతినగర్ లో నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కొడుకు కోటాన దేవాన్ (3) ఉన్నారు. కాగా మంగళవారం ఉదయం కోటాన సత్యనారాయణ ఆయన సతీమణి మహేశ్వరి, కొడుకు దేవాన్ కలిసి ద్విచక్ర వాహనం పై హైదరాబాద్ కు బయలుదేరారు. మామిడిపల్లి జాతీయ రహదారి చౌరస్తా వద్దకు రాగానే హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ వేగంగా వచ్చి వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి కొట్టింది. దీంతో వెనక కూర్చున్న మహేశ్వరితో పాటు ఆమె కొడుకు దేవాన్ అక్కడికక్కడే మృతి చెందారు. సత్యనారాయణ స్థానిక అరవింద ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ద్విచక్ర వాహనం నడిపిస్తున్న సత్యనారాయణకు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
.