తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): సమాజంలో దివ్యాంగులు సకలాంగులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, వారి మనోధైర్యం, ఆత్మస్థైర్యం అందరికీ స్ఫూర్తిదాయకమని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు.
మంగళవారం సంగారెడ్డి పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ స్టేడియం గ్రౌండ్స్ లో మహిళా, శిశు , దివ్యాంగుల మరియు వయోవృద్దుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతికూలతలను అధిగమిస్తూ అసమాన విజయాలను సాధించే దివ్యాంగులు ఎంతో మందికి స్పూర్తి ప్రదాతలుగా నిలుస్తారన్నారు. దివ్యాంగులలో మనోస్థైర్యం, ఆత్మస్థైర్యం అందరికన్నా ఎక్కువగా ఉంటుందని, ఈ క్రీడా పోటీలలో తమ పూర్తి శక్తి సామర్ధ్యాలు ఉపయోగించి గెలవాలని కోరారు. జిల్లాస్థాయి దివ్యాంగుల ఆటల పోటీలలో శారీరక వైకల్య సమస్యలను అదిగమించి ఉత్సాహంగా పాల్గొంటున్న వారందరిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. అనంతరం క్రీడా పోటీలను ప్రారంబించారు. దివ్యాంగులకు నిర్వహించిన చెస్, క్యారమ్, వీల్ చైర్స్ రేస్, రన్నింగ్, షాట్ పుట్ పోటీలను ఆయన వీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సంధ్యారాణి, జిల్లా యువజన క్రీడల అధికారి రామచందర్ రావు, డీఆర్డీఏ అదనపు పీడి సూర్యారావు,
సీడిపివోలు, దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు , పీఈటీలు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వాలంటీర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.
.