ప్రజావాణికి 108 దరఖాస్తులు

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి

అధికారులు నిర్ణీత సమయంలోగా ప్రజావాణికి హాజరు కావాలి

సంగారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలని, అధికారులు ప్రజావాణి కార్యక్రమానికి నిర్ణీత సమయం లోగా హాజరుకావాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులకు ఆదేశించారు.

సోమవారం కల్లెక్టరేట్ గ్రీవెన్స్ హాల్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి   వచ్చిన ప్రజల నుండి అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి  ఫిర్యాదులను స్వీకరించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చంద్ర శేఖర్ మాట్లాడుతూ..ప్రజావాణి ద్వారా వచ్చిన పిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. దరఖాస్తుదారుకు వెంటనే రిప్లై ఇవ్వాలన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు నిర్ణిత సమయంలోగా రాకుండా, లేటుగా రావడంపై అసహనం వ్యక్తం చేశారు.

ప్రజావాణి కార్యక్రమంలో ( 108 ) దరఖాస్తులు వచ్చాయని, అందులో 83 రెవెన్యూ శాఖకు సంబంధించినవి కాగా,  ఇతర శాఖలకు సంబంధించి 25 దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు.

ఎన్నికలు పూర్తయినందున, ఇక శాఖాపరమైన కార్యక్రమాలపై ఆయా శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

క్రిస్మస్ పండగ సందర్భంగా జిల్లాలో క్రైస్తవులకు విందు భోజనాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, అట్టి విషయమై మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ కమిటీలు, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని కోరారు. మండల ప్రత్యేక అధికారులు తమతమ మండలాల్లో క్షేత్ర పరిధిలో తిరిగి, పూర్తిస్థాయిలో ఫీడ్ బ్యాక్ ఇవ్వాలన్నారు. తప్పనిసరిగా వసతి గృహాలను సందర్శించాలని, అన్ని సంక్షేమ వసతి గృహాలలో పిల్లలకు అవసరమైన మౌలిక వసతులు ఉన్నాయా, భోజనం సక్రమంగా అందుతుందా అన్న విషయాలను పరిశీలించాలని తెలిపారు.

వసతి గృహాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరా కనెక్షన్స్ లేనట్లయితే సంబంధిత డి ఈ, ఏఈలకు వెంటనే నివేదిక నివ్వాలన్నారు. అన్ని గ్రామాలలో, వసతి గృహాలలో  మిషన్ భగీరథ నీటి సరఫరా సవ్యంగా జరగేలా చూడాలని మిషన్ భగీరథ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, డిఆర్ఓ నగేష్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

.