మహా విష్ణువుకు ప్రీతికరం
ప్రారంభమైన ధనుర్మాస ఉత్సవాలు
వైష్ణవ ఆలయాల్లో భక్తుల కిటకిట
నెల రోజుల పాటు నిత్యం అభిషేకాలు, ప్రత్యేక పూజలు
జనవరి 15వ తేదీతో ముగియనున్న ఉత్సవాలు
ఈ నెల 23న వైకుంఠ ఏకాదశి పర్వదినం
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): ధనుర్మాసం.. శ్రీ మహా విష్ణువుకు ప్రీతికరం. దివ్య ప్రార్థనకు.. సూర్యోదయానికి ముందే విష్ణువు ఆరాధనకు.. అత్యంత పవిత్రమైనదీ మాసం. సూర్యుడు ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకూ అంటే భోగి పండుగ వరకు కొనసాగుతుందీ మాసం. ఈ సమయంలో అందరికీ గుర్తుకు వచ్చేది గోదాదేవి చేసిన తిరుప్పావై వ్రతం. ఈ వ్రతం వల్ల శ్రీ మహాశిష్ణువు.., నిత్యం దీపారాధన వల్ల మహాలక్ష్మి కరుణా, కటాక్షలు సిద్ధిస్తాయని నమ్మకం. ఆదివారం ప్రారంభమైన ఉత్సవాలు.. జనవరి 15వ తేదీ వరకు జరుగనున్నాయి.
ధనుర్మాసం వచ్చిందంటే ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. కార్తీక, మాఘ, శ్రావణ మాసం.. ఇలా ఈ నెలలకు మాత్రమే ప్రాధాన్యత ఉన్నదని భావిస్తారు. కానీ, ధనుర్మాసానికి కూడా చాలా ప్రత్యేకత ఉన్నది.
గోదాదేవి కళ్యాణం..
ధనుర్మాసం పురస్కరించుకొని ఆలయాల్లో ఆండాళ్ పూజ, తిరుప్పావై పఠనం, గోదాదేవి కళ్యాణం, విష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. విష్ణు చిత్తడి కుమార్తె గోదాదేవి.. మానవ మాత్రులకు కాకుండా శ్రీ రంగనాథుడినే వివాహం చేసుకుంటానని దీక్షకు చేపడుతుంది. ధనుర్మాసంలో వేకువజామునే లేచి నిత్యం విష్ణువుకు పద్యం (పాశురం రూపంలో) రచించేది. అలా 30 పాశురాలను ఆ మాసంలో రచించి, వాటిని విష్ణువుకు అంకితం చేసింది. ఆమె భక్తికి మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై.. శ్రీరంగం రమ్మని అమెకు సూచిస్తాడు. ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో, ఆయన గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరుకుంటాడు. రంగనాథస్వామితో వివాహం జరిగినంతనే గోదాదేవి ఆయన పాదాల చెంత మోకరిల్లి స్వామిలో అంతర్లీనమైపోతుంది. అలా గోదారంగనాథుల కళ్యాణం జరుగుతుంది. అప్పటి నుంచి విష్ణు ఆలయాల్లో ధనుర్మాసంలో శ్రీ గోదారంగనాథుల కళ్యాణాన్ని అంగరంగా వైభవంగా నిర్వహిస్తారు. వేడుక చూసిన వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని ప్రతీతి. శ్రీ మహావిష్ణువును ఆరాధించేందుకు, ఆయన అనుగ్రహాన్ని పొందేందుకు ధనుర్మాసం విశిష్టమైనదిగా చెప్పబడుతుంది.
జిల్లా కేంద్రంమైన మెదక్ శ్రీ కోదండ రామాలయం, శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ధనుర్మాసం వెళ్లే రెండ్రోజుల ముందు శ్రీ గోదారంగనాథుల కళ్యాణాన్ని నిర్వహించి, స్వామివారి పల్లకీని ఊరేగిస్తారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు…
ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ఉమ్మడి మెదక్ జిల్లాలోని వైష్ణవ ఆలయాల్లో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మెదక్ జిల్లా కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయంలో అర్చకులు శ్రీ భాష్యం మధుసూదన్ చార్యులు, శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శ్రీ నరేంద్ర చార్యులు వెకువ జామున స్వామి వార్లకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నెలపాటు సుప్రభాతానికి బదులు తిరుప్పావై పఠనం చేస్తూ, అర్థాన్ని, ధనుర్మాసం ప్రత్యేకత, విశిష్ఠతను భక్తులకు వివరిస్తున్నారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేసించే భోగి వరకు (సంక్రాంతి ముందు రోజు) ధనుర్మాసం కొనసాగుతుందని అర్చకులు తెలిపారు. విష్ణుమూర్తికి ప్రీతికరమైనదని అంటున్నారు. ధనుర్మాసమంతా గోదాదేవి(ఆండాళ్) మార్గళి వ్రతం పేరుతో విష్ణు వత్రం చేపట్టి స్వామి వారిని కీర్తిస్తారు. భూదేవి అవతారమైన ఆండాళ్ తల్లి రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రావిడ భాషలో తిరు అంటే ప్రవిత్రమైన, పావై అంటే వత్రం అని అర్థం. ఈ మాసంలో వైష్ణవ ఆలయాలను సందర్శించి, ప్రత్యేక పూజలు చేయడం మంచిదని అర్చకులు చెబుతున్నారు. దాంతో వేకువ జామునే భక్తులు ఆలయాలకు చేరుకొని, స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీంతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి.
ఆదివారం మెదక్ పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంతో పాటు శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ మాసమంతా ప్రత్యేక పూజలు కొనసాగనున్నాయి. భక్తులు వేకువజామునే ఆలయాలకు వచ్చి, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భోగితో (15వ తేదీ) ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. జనవరి 12, 14 తేదీల్లో శ్రీ గోదా రంగనాథుల కళ్యాణాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చుకులు శ్రీ భాష్యం మధుసూదన్ చార్యులు, నరేంద్ర చార్యులు తెలిపారు. ఈ వేడుకతో ఈ మాసం ముగుస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 23 శనివారం వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వారా దర్శనం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ బండ నరేందర్ తెలిపారు.
.