తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): చెల్లెలికి ప్రమాదం జరిగిందని తెలిసి పరామర్శించడానికి వచ్చి సోదరుడు మృత్యువాత పడ్డాడు. మెదక్ టౌన్ ఎస్ఐ పోచయ్య తెలిపిన కథనం ప్రకారం.. బీబీపేట్ మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన కొరుగుల నరసింహులు (47) చెల్లెలు రేణుకకు యాక్సిడెంట్ కావడంతో మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. తన చెల్లెలిని పరామర్శించడానికి నర్సింలు శుక్రవారం ఉదయం ఆసుపత్రికి వచ్చాడు. కాగా ప్రభుత్వ ఆసుపత్రిలో కాలకృత్యాలకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి పడడంతో తలకు తీవ్ర గాయమై చనిపోయినట్లు తెలిపారు. మృతుని భార్య భాగ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. మృతునికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మెదక్ టౌన్ ఎస్.ఐ పోచయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
