పార్లమెంటుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం..
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు
కార్యకర్తల కృషి ఫలితమే నా గెలుపు
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): కార్యకర్తలు అధైర్య పడొద్దని అండగా నేను ఉంటానని.. మీకు నాతో ఏ అవసరం ఉంటే గంటలో మీ ముందు ఉంటానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. బుధవారం నర్సాపూర్ పట్టణంలోని కంచర్ల శంకర్ యాదవ్ కళ్యాణ మండపంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి గెలుపు పట్ల కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హాజరై ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. నర్సాపూర్ నియోజకవర్గ కార్యకర్తల కృషి ఫలితమే బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించిందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తించుకుంటుందని అన్నారు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు స్థానిక సంస్థ ఎన్నికల్లో సర్పంచ్, ఎంపిటిసి, జెడ్పిటిసిలుగా, కౌన్సిలర్లుగా గెలిపించుకుంటామని హామీనిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బ్రేక్ లాంటిదని అంతిమంగా గమ్యం చేరేది బిఆర్ఎస్ పార్టీ అని గుర్తు చేశారు. కేసిఆర్ పనితనం తప్ప పగబట్టే మనస్తత్వం కాదని ఆయన గుర్తు చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ విషయంలో అనేక అవకతవకలకు పాల్పడ్డారని అయినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ప్రజల అభివృద్ధి కోసం ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వానికి సహకరించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ప్రజల పక్షాన ఉండి పోరాడుతామని ఆయన తెలిపారు.
పార్లమెంటుపై గుర్తు తెలియని దుండగులు టియర్ గ్యాస్ తో జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. దాడికి పాల్పడిన దుండగులను వెంటనే గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే సునీతరెడ్డి మాట్లాడుతూ తన గెలుపు కార్యకర్తల కృషి ఫలితమేనని తెలిపారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేస్తానని చెప్పారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో నర్సాపూర్ నియోజకవర్గంలో గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మదర్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జెడ్పి చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, నాయకులు దేవేందర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, చంద్ర గౌడ్, మన్సూర్, గాలి అనిల్ కుమార్, గోపి, హరికృష్ణ, అశోక్ గౌడ్, సత్యగౌడ్, నయీమొద్దిన్, పంబల్ల బిక్షపతి, నాగేష్, జగదీశ్వర్, శివకుమార్, బోగ చంద్రశేఖర్, రమణగౌడ్, వెంకటరామిరెడ్డి, రాజు యాదవ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
.