గత ప్రభుత్వం ఆర్టీసీని గాలికి వదిలేసింది
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తుంది
ప్రతిపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలి
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖా మాత్యులు పొన్నం ప్రభాకర్
తెలంగాణ ప్రభ, ( ఉమ్మడి మెదక్ బ్యూరో): గత ప్రభుత్వం ఆర్టీసీని గాలికి వదిలేసిందని, ఆర్టీసీని బలోపేతం చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం ఆయన సిద్దిపేట జిల్లా కేంద్రంలో మార్నింగ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ, ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్ స్టేషన్ లో మంత్రి పొన్నం పర్యటించారు. ప్రయాణికులతో ముచ్చరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహాలక్ష్మి పథకం అమలుపై మహిళలతో మాట్లాడారు. గత ప్రభుత్వం ఆర్టీసీని గాలికి వదిలేసిందని విమర్శించారు. ఆర్టీసీని బలోపేతం చేస్తామని, మరికొన్ని నూతన బస్సులను ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యల పట్ల స్పందిస్తూ... కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు కాకముందే ప్రతిపక్షాలైన బిఆర్ఎస్ బిజెపి లు చేస్తున్న వ్యాఖ్యల పట్ల సభ్య సమాజం అసహ్యించుకుంటుందని అన్నారు. ప్రతిపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలని ప్రభుత్వంలోని లోటుపాట్లను చూపి, ప్రజాస్వామిక విలువలను కాపాడాలని అన్నారు. ప్రభుత్వంపై చేస్తున్న వ్యాఖ్యలను విరమించుకోకపోతే గట్టిగా జవాబు చెప్పాల్సి వస్తుందని మంత్రి పొన్నం అన్నారు. సంవత్సరంలోపు కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ... రాజాసింగ్ కు ఏమైనా జ్యోతిష్యం తెలుసా అని ప్రశ్నించారు. బిజెపి బీఆర్ఎస్లు వేరువేరు కాదని, వారి కుట్ర అందరికీ అర్థమైందని, కాంగ్రెస్లో గెలిచిన ఏ ఒక్క నాయకుడు పార్టీని వదిలి వెళ్ళడని మంత్రి పొన్నం అన్నారు.
ప్రజా అభిప్రాయాల మేరకు, ప్రజల చేత ఎన్నుకోబడిన కాంగ్రెస్ ప్రభుత్వం లో ప్రజలు పూర్తి స్వేచ్ఛతో తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకోవచ్చని తెలిపారు.
.