ప్రజారంజక పాలన అందించడమే లక్ష్యం : రాష్ట్ర రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్ ను గుర్తుండి పోయేలా అభివృద్ధి చేస్తా

రాష్ట్ర రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని..తమ ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ లో  ప్రజలను కలిసిసమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో పాలకవర్గంతో, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఎన్నికల వరకే రాజకీయాలని, 

హుస్నాబాద్ టౌన్ సమస్యలు తెలుసుకొని, పరిష్కరించడానికి కృషి చేస్తాన ని తెలిపారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియని, హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ మెడికల్ కాలేజీ ప్రకటించడంతో హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి నాంది పడిందన్నారు. 

గతంలో ఎన్ఎస్ యుఐ నాయకుడిగా, మార్క్ఫెడ్ చైర్మన్ గా, ఎంపీగా పనిచేసిన అనుభవం ఉందన్నారు.

కరీంనగర్ పార్లమెంటు అభివృద్ధి కోసం ఏ విధంగా కృషి చేశానో, హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అలాగే పని చేస్తానని హామీ ఇచ్చారు. 

హుస్నాబాద్ లో కేంద్రీయ విద్యాలయం తీసుకు రావడానికి కృషి చేస్తానని, 

హుస్నాబాద్ టౌన్ పరిధిలో వైద్యం, ఆరోగ్యం, పారిశుధ్యం రింగురోడ్డు, ఎల్లమ్మ చెరువు అభివృద్ధి, టౌన్ సుందరీకరణ  కోసం కృషి చేస్తానని హామీనిచ్చారు.

హుస్నాబాద్ లోనే ఉంటూ నియోజక వర్గ అభివృద్ధి కోసం పాటుపడతానని, మార్నింగ్ వాక్ లో సమస్యలు తెలుసుకొని అప్పటికప్పుడే ఆ సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించడం జరుగుతుందన్నారు. 

నిరుపేదలు పక్కా ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, 

రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా నియోజకవర్గ పేరు చెబితే, హుస్నాబాద్  గౌరవం నిలిచేలా కృషి చేస్తామన్నారు. నియోజకవర్గ నాయకులు, మున్సిపల్ పాలకవర్గం,  అధికారులు పాల్గొన్నారు.

సిద్దిపేట కలెక్టరేట్లో సమీక్ష..

సిద్దిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్ర రవాణా, బీసీ శాఖా మాత్యులు పొన్నం ప్రభాకర్ అధికారులతో సమావేశమయ్యారు. పొన్నం ప్రభాకర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వ అధికారులతో తొలిసారి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అధికారులు ప్రజలతో మమేకమై పని చేయాలి అని అన్నారు. ప్రభుత్వం మారిందని, ప్రజల్లో కూడా మార్పు వచ్చిందని. ప్రభుత్వ అధికారుల పనితీరు కూడా మారాలని, అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని అన్నారు. ఈ సందర్భంగా పలు శాఖల అధికారులతో మంత్రి పొన్నం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నంతో పాటుగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, శ్రీనివాస్ రెడ్డి, కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేత, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సరోజ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

.