పదవులను త్యాగం చేసిన పార్టీ బి ఆర్ ఎస్ : ఎమ్మెల్యే హరీష్ రావు

ప్రజా సమస్యలపై గొంతుకవుదాం

సంగారెడ్డి ఆత్మీయ సభలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు 

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తమ పదవులను త్యాగం చేసిన పార్టీ బీఆర్ఎస్ అని, గెలిచినప్పుడు పొంగిపోలేదని.. ఓడినప్పుడు కుంగిపోవద్దని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు కార్యకర్తలకు సూచించారు.  మంగళవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కేసీఆర్ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు. తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ అని గెలిచినప్పుడు పొంగి పోలేదు... ఓటమితో కుంగి పోలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్  నిరాహార దీక్ష చేపట్టి తెలంగాణ సాధించారని కొనియాడారు. సాధనలో తమ పదవులకు సైతం త్యాగం చేశామని, 2004లో, 2009లో అనుకున్న ఫలితాలను బీఆర్ఎస్ సాధించలేదన్నారు.

కానీ పోరాడి తెలంగాణ సాధించి 2014లో ఘన విజయం సాధించి అధికారం చేపట్టామన్నారు. రెండుసార్లు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించారన్నారు. కేసీఆర్ దమ్మున్న నాయకుడు కనుకే తెలంగాణ వచ్చిందన్నారు. దురదృష్టశావత్తు మనం అధికారం కోల్పోయామని, కేవలం 2 శాతం ఓట్లతో అధికారం కోల్పోవడం జరిగిందని, బీఆర్ఎస్ ఎప్పుడూ తెలంగాణ ప్రజల పక్షమే అన్నారు. కొన్ని స్థానాలు స్వల్ప మెజారిటీతో కోల్పోయామని తెలిపారు.  రానున్న రోజుల్లో స్థానిక, పార్లమెంట్ ఎన్నికల రూపంలో పరీక్షలు రాబోతున్నాయని,  పకడ్భంది కార్యాచరణతో ముందుకు పోతామని వివరించారు.

కొత్త ప్రభుత్వానికి కొంత టైం ఇద్దామని, వాళ్ళిచ్చిన హామీల అమలులో విఫలం అయితే ప్రజా గొంతుక అవుదామని తెలిపారు. మన నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారని, మనం ధైర్యం కోల్పోపోకుండా, ఏమైనా లోపాలు ఉంటే సమీక్షించుకుందామని కార్యకర్తలకు సూచించారు.   ఉమ్మడి మెదక్ జిల్లాలో మంచి ఫలితాలు సాధించడం జరిగిందని, కార్యకర్తలకే సంగారెడ్డి విజయం అంకితమన్నారు.

ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ, మాజీ ఎమ్మెల్సీలు సుధాకర్ రెడ్డి, దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్, మామిళ్ల రాజేందర్, కాసాల బుచ్చిరెడ్డి, వివిధ మండలాల ఎంపీపీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

.