అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలి

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ 

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): 2024 జనవరి 1 నాటికి 18 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న వారందరిని ఓటరు జాబితాలో తప్పనిసరిగా పేరు నమోదు చేసుకునేలా చూడాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు సూచించారు. 

ఆ మేరకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలింగ్ బూత్ వారీగా విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 

మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి ఆర్డీవోలు, తహసిల్దార్లతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్   మాట్లాడుతూ ఎస్ఎస్ఆర్-2024లో భాగంగా, వచ్చే జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న యువతీ, యువకులందరు ఓటర్లుగా నమోదయ్యేలా  కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఓటరు జాబితాలో పేర్ల నమోదు కోసం వచ్చే దరఖాస్తులను వెంటదివెంట పరిష్కరించాలన్నారు. 

ఫారం 6, 7, 8  పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.

జనవరి 06 వ తేదీన డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేయాల్సి ఉంటుందని, ఆ తరువాత ఓటరు జాబితాకు సంబంధించి ఆక్షేపణలు, క్లెయిమ్స్ ను జనవరి 22 వ తేదీ వరకు  స్వీకరించి,  2024 ఫిబ్రవరి 2 వ తేదీ వరకు పరిశీలన పూర్తి పరిష్కరించాలని సూచించారు.  ఫిబ్రవరి 08 న తుది ఓటరు జాబితాను వెలువరించాల్సి ఉంటుందని తెలిపారు.

ఎస్ఎస్ఆర్- 2024లో భాగంగా ఓటర్ల జాబితా సవరింపులో ఓటర్ నమోదు, మార్పులు, చేర్పులు తొలగింపులపై పక్కా ప్రణాళికతో చేయాలన్నారు.

ఎ లాంటి తప్పిదాలకు తావివ్వరాదన్నారు.

ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఓటరు జాబితాలో ఏవైనా లోటుపాట్లు ఉంటే సవరించుకోవాలని సూచించారు.   

ఈ కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ మాధురి, రెవిన్యూ డివిజనల్ అధికారులు, తహసిల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

.