కార్మికులకు కనీస వేతనం 26 వేలకు పెంచాలి

సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు 

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా కొలువుదీరిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఎనుముల రేవంత్‌రెడ్డికి సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అభినందనలు తెలిపారు. ప్రజా ప్రభుత్వం కార్మికుల సమస్యల సత్వర పరిష్కారానికి తగిన ప్రాధాన్యతనిచ్చి పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం  సంగారెడ్డిలోని కేవలం కిషన్ భవనంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కార్మికుల సమస్యలు పరిష్కారం కాక కనీస వేతనాలు అమలు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కార్మిక శాఖ మంత్రిని వెంటనే ప్రకటించాలని ఆయన కోరారు. 73 షెడ్యూల్డ్‌ ఎంప్లాయిమెంట్స్‌ జీఓలను సవరించాలనీ, విడుదలైన ఐదు జీఓలకు గెజిట్‌ జారీ చేసి కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలన్నారు. ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు సిబ్బందిని పర్మినెంట్‌ చేయాలనీ, సమానపనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. స్కీమ్‌ వర్కర్లను కార్మికులుగా గుర్తించి సామాజిక భద్రత చట్టాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.  స్థానిక సంస్థల్లో పనిచేసే గ్రామ పంచాయతీ, మున్సిపల్‌ కార్మికులకు వేతనాలు పెంచడం, ఉద్యోగ భద్రత కల్పించడం, అసంఘటితరంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయడం, నూతన పెన్షన్‌ విధానం రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించడం వంటివి చేయాలని కోరారు. బీడీ పరిశ్రమ రక్షణకు చర్యలు తీసుకోవాలనీ, బీడీ కార్మికులందరికీ షరతులు లేకుండా జీవనభృతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పంచాయతీల్లోని కారోబార్‌, బిల్‌ కలెక్టర్లకు స్పెషల్‌ స్టేటస్‌ ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలను పర్మినెంట్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆశా వర్కర్లకు ఫిక్స్‌డ్‌ వేతనం ఇవ్వాలని, ఐకెపి విఓఏలకు కనీస వేతనాలు నిర్ణయించి సెర్ప్‌ ద్వారా ఇవ్వాలని కోరారు. మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంచాలనీ, రెండో ఏఎన్‌ఎంలను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

 ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బి మల్లేశం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి ప్రవీణ్ కుమార్ సిఐటియు నాయకులు శ్రీనివాస్ మల్లేశం రవి, నాగరాజు మోహన్ అప్పలనాయుడు మోహన్ చారి శ్రీనివాస్ గౌడ్ పాండురంగం జావిద్ తదితరులు పాల్గొన్నారు.

.