ప్రోటోకాల్ పాటించడం లేదని అధికారులపై మండిపడ్డ నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య రసాభసగా మారింది. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి చివరకు పథకం ప్రారంభించకుండానే వెనుతిరిగి వెళ్లిపోయిన సంఘటన నర్సాపూర్ పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రిలో ఆదివారం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి అధికార పార్టీ నాయకులతో పాటు స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి అధికారులు సమాచారం ఇచ్చి కార్యక్రమం ప్రారంభోత్సవానికి రావాలంటూ ఆహ్వానించారు. అయితే సునీత లక్ష్మారెడ్డి వచ్చేసరికే ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వేదికపై ఇటీవల కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆవుల రాజిరెడ్డి, డిసిసి ప్రెసిడెంట్ ఆంజనేయులు గౌడ్, జిల్లా అదనపు కలెక్టర్ రమేష్, ఆర్డీవో శ్రీనివాసులు, తాసిల్దార్ కమలాద్రి తదితర శాఖల అధికారులు ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎలా ఉంటారని, ఎమ్మెల్యే విషయంలో ప్రోటోకాల్ పాటించడం లేదని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అధికారులపై మండిపడ్డారు. ప్రోటోకాల్ విషయంలో తలెత్తిన వివాదం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య చిలికి చిలికి గాలి వానలా మారి ఒకరిపై ఒకరు వాగ్వివాదం చేసుకొని ఒక దశలో కొట్టుకోవడానికి వెళ్లారు. దీంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించకుండానే ఎమ్మెల్యే సునీత రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
.