పంచాయితీ పోరుకు రంగం సిద్ధం

కసరత్తు ప్రారంభించిన అధికార యంత్రాంగం

కొత్త సర్కారు నిర్ణయం పైనే ఎన్నికలు

సంగారెడ్డి జిల్లాలో 647 పంచాయతీలు

మెదక్ జిల్లాలో..469 పంచాయతీలు

సిద్దిపేట జిల్లాలో 499 పంచాయతీలు

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పటికీ  గ్రామ పంచాయతీ ఎన్నికల పోరుకు అధికార యంత్రాంగం  కసరత్తు ప్రారంభించింది. సర్పంచుల పదవీకాలం మరో 50 రోజుల్లో ముగుస్తుండటంతో ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తోంది.  ఇందులో భాగంగా ఆయా గ్రామ పంచాయతీలలో ఎన్నికలను నిర్వహించేందుకు అవసరమైన రిటర్నింగ్  అధికారులను గుర్తించాలని ఆదేశించింది. ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బంది వివరాలను సేకరించాలని ఆదేశించింది. ఈ వివరాలన్నింటిని ఆన్ లైన్ లో పొందు పరచాలని పేర్కొంది.

దీంతో ఆయా జిల్లాల పంచాయతీ అధికారులు ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

ప్రస్తుతం ఉన్న సర్పంచుల పదవీకాలం 2024 ఫిబ్రవరి 1తో ముగియనుంది. ఇంకా కేవలం 50 రోజులు మాత్రమే మిగిలి ఉంది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ సర్కారు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహిస్తుందా లేదా అనేది కొద్ది రోజుల్లో తేలుతుంది. ఇలా ఉండగా పకడ్బందీగా ఈ ఎన్నికలను జరిపేందుకు పంచాయతీరాజ్ శాఖ సిద్ధమవుతోంది. ఇందుకోసం కసరత్తును ప్రారంభించింది.

డివిజన్ల వారీగా ఎన్నికలు 

గ్రామ పంచాయతీ ఎన్నికలను పంచాయతీ డివిజన్ల వారీగా నిర్వహిస్తారు. ఒక్కోరోజు ఒక్కో డివిజన్లలో పోలింగ్ ప్రక్రియ ఉంటుంది. అలాగే ఈ ఎన్ని కలను ఎమ్మెల్యే ఎన్నికల మాదిరిగా కాకుండా స్టేజ్-1, స్టేజ్ -2లో నిర్వహిస్తారు. స్టేజ్-1లో అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ, గుర్తుల కేటాయింపు, బ్యాలెట్ పత్రాలు ముద్రణ వంటి ప్రక్రియ ఉంటుం ది. స్టేజ్-2లో పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. ఓటర్లు సర్పంచును, వార్డు సభ్యునికి ఇద్దరికి ఓటేయాల్సి ఉంటుంది.

అయితే గ్రామాల్లో తాము చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాలేదని ప్రస్తుతం ఉన్న సర్పంచులు వాపోతున్నారు. కొత్త ప్రభుత్వం పాలన గాడిన పడాలంటే కనీసం మరో రెండు, మూడు నెలలైనా పడుతుంది. ఈ క్రమంలో తమ పదవీకాలం ముగిస్తే తమకు రావాల్సిన బిల్లుల పరిస్థితి ఏమిటని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామ పంచాయతీల ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి పూర్తి అధికారాలు లేవు. ప్రభుత్వం అనుమతి ఇస్తేనే ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.

ఈ ఎన్నికల నిర్వహణకు సైతం ప్రభుత్వమే నిధులు మంజూరు చేయాల్సి ఉంటుంది. అయితే కొత్త సర్కారు సకాలంలో ఈ ఎన్నికలు నిర్వహిస్తుందా లేక పదవీకాలం ముగిశాక కూడా పర్సన్ ఇన్చార్జిలను నియమించి మరికొద్ది నెలలు వేచి ఉంటారా..? అనే అంశంపై సంబంధిత వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఉమ్మడి మెదక్ జిల్లాలో వివరాలు.. 

ఉమ్మడి మెదక్ జిల్లాలో పంచాయతీ పోరుకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. సంగారెడ్డి జిల్లాలో 647 గ్రామపంచాయతీలు ఉండగా 4,779 వార్డులు ఉన్నాయి. మెదక్ జిల్లాలో 469 పంచాయితీలు ఉండగా  3,002 వార్డులు ఉన్నాయి. అలాగే సిద్దిపేట జిల్లాలో  499 పంచాయితీలకు గాను  4,470 వార్డులు ఉన్నాయి.

.