మెదక్ రింగ్ రోడ్డుకు కృషి చేస్తా
మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): ఏడుపాయల వన దుర్గామాత ఆలయాన్ని యాదాద్రి లాగా తీర్చిదిద్దుతానని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తెలిపారు. శుక్రవారం మెదక్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పదేళ్ల నియోజక ప్రజల కల నెరవేరబోతుందని అన్నారు. కార్యకర్తల, నాయకుల, పాత్రికేయుల కష్ట ఫలితమే తన కుమారుడు డాక్టర్ రోహిత్ రావు గెలుపొందడం జరిగిందన్నారు. యాదాద్రిలో అయ్యవారి ఆలయం ఎంత అభివృద్ధి జరిగిందో అదే స్థాయిలో ఏడుపాయలలో అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి ఎమ్మెల్యే కృషి ఏం చేస్తాడని హామీనిచ్చారు.
పదేళ్లపాటు మెదక్ ప్రజలు ఎన్నో కష్టనష్టాలను చవిచూశారని వారందరి అభివృద్ధి కలలు తన కుమారుడు నిజం చేసి చూపిస్తాడని తెలిపారు. మెదక్ పట్టణం చుట్టూ రింగ్ రోడ్డు ఏర్పాటుకు త్వరితగతిన కృషి చేస్తానని చెప్పారు. పదేళ్లపాటు అభివృద్ధికి నోచుకోని మెదక్ పట్టణాన్ని మిగతా జిల్లాల మాదిరిగా తీర్చిదిద్దేలా కృషి చేస్తారని చెప్పారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రజలదని నిరభ్యంతరంగా తమ సమస్యలను వెల్లడించడానికి రావచ్చని హనుమంతరావు సూచించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మహేందర్ రెడ్డి, ముత్యంరెడ్డి, జీవన్ రావు, ప్రశాంత్ రెడ్డి బొజ్జ పవన్, భరత్ రెడ్డి, విప్లవ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
.