మంత్రివర్యా... దామోదర

వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా దామోదర్ రాజనర్సింహ

తొలి జాబితాలోనే ఉమ్మడి మెదక్ జిల్లాకు స్థానం 

తెలంగాణ ప్రభ,(ఉమ్మడి మెదక్ బ్యూరో): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు తొలి జాబితాలోనే చోటు దక్కింది. తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం గురువారం చేశారు . సీఎం ప్రమాణ స్వీకారంతో పాటు 11 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగిన విషయం తెలిసిందే. మంత్రుల తొలి జాబితాలో అందరూ ఊహించినట్టుగానే  ఉమ్మడి మెదక్ జిల్లా నుండి ఆందోల్ ఎమ్మెల్యే, ఏఐసీసీ వర్కింగ్ కమిటీ శాశ్వత మెంబర్ దామోదర రాజనర్సింహకు చోటు దక్కింది. దామోదర రాజనర్సింహకు వైద్య, ఆరోగ్య శాఖను కేటాయించారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు గాను మూడింట కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందిన విషయం తెలిసిందే. నారాయణఖేడ్,  మెదక్ ఎమ్మెల్యేలు తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు.

అంచలంచలుగా ఎదిగిన దామోదర..

1989లో తండ్రి మరణంతో దామోదర రాజనర్సింహ రాజకీయాల్లోకి ప్రవేశించాల్సి వచ్చింది. 1989లో జరిగిన అందోల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొంది తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రెండు సార్లు ఓటమి చెందినా, నియోజకవర్గాన్ని మాత్రం వదల్లేదు. ఇక్కడి ప్రాంత ప్రజలతో మమేకమైన ఆయన 2004 ఎన్నికల్లో అప్పట్లో మంత్రిగా పనిచేసిన పి.బాబూమోహన్ పై భారీ మెజార్టీతో దామోదర్ గెలుపొందారు. 2006లో వైఎస్ఆర్ పాలనలో మంత్రివర్గంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో గెలుపొందిన దామోదర వైఎస్ఆర్, రోశయ్య హయాంలోని మంత్రి వర్గంలో పనిచేశారు. 2010లో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో పనిచేశారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ  ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాల్సిన సందర్భం రావడంతో 2011 జూన్ 10వ తేదీన డిప్యూటీ సీఎంగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2014, 2018 ఎన్నికల్లో ఓటమి చెందగా, ఆగస్టు 20, 2023న జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానిత సభ్యుడిగా నియమితులయ్యారు. ప్రస్తుతం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి క్రాంతికిరణ్ పై విజయాన్ని సాధించి, ఎమ్మెల్యేగా గెలుపొందారు.  

 ఇలా ఉండగా అందోల్ నియోజకవర్గానికి ఇప్పటివరకు 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరుగగా, అందులో 9 సార్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులే గెలుపొందగా, వీరిలో దామోదర కుటుంబ సభ్యులు ఆరుసార్లు విజయాన్ని సాధించడం విశేషం. అయితే వీరిలో అత్యధిక ఓట్లు మెజార్టీతో గెలుపొందిన అభ్యర్థి, అతి తక్కువ ఓట్లతో ఓటమి చెందిన అభ్యర్థి సి.దామోదర రాజనర్సింహనే కావడం విశేషం. నియోజకవర్గంలో 1999లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అప్పటి టీడీపీ అభ్యర్థి బాబూమోహన్ చేతిలో 513 అత్యల్ప ఓట్లతో ఓటమి చెందారు. 2004వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బాబూమోహన్ ను 24,846 ఓట్ల మెజార్టీతో దామోదర్ ఓడించారు. అతిస్వల్ప ఓట్లతో ఓడిన, అత్యధిక మెజార్టీతో గెలుపొందిన నేతగా దామోదరకు పేరు వచ్చింది. అయితే ఈ ఎన్నికల్లో వెలువడిన ఫలితాల్లో సమీప ప్రత్యర్థి క్రాంతి కిరణ్ పై 28,193 ఓట్ల మెజార్టీతో గెలుపొంది తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నారు.

కాగా తొలి క్యాబినెట్ లోనే దామోదర రాజనర్సింహకు చోటు దక్కి వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం పట్ల ఆందోల్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

.