బీజేపీ నేత పంజా విజయ్ కుమార్
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): మెదక్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకనవుతానని పంజా విజయ్ కుమార్ అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలోని మాయ గార్డెన్ లో నిర్వహించిన బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
మెదక్ అసెంబ్లీ ఎన్నికలో తనకు ఓట్లు వేసిన కార్యకర్తలకు, ప్రజలకు శిరస్సు వహించి పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు.
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ప్రజా సమస్యలపై మున్ముందు మరింతగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి క్యాడర్ ను పట్టించుకోక పోవడంతోనే ఓడిపోయిందన్నారు. మున్ముందు తాను ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటానని, ప్రతి గ్రామంలో బీజెపి కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు.
గ్రామ గ్రామాన ప్రధాని మోడీ పథకాలు ప్రజలకు వివరించాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తానని తెలిపారు. పార్టీ బలోపేతం కోసమే ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించామని, కార్యకర్తలు ఎవరు కూడా అధైర్య పడొద్దని తెలిపారు.
రాబోయే మెదక్ పార్లమెంటు లో బీజేపీ గెలుపుకు కార్యాచరణ రూపొందిస్తామని, రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతామన్నారు.
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ధీటుగా బీజేపీ పని చేసిందన్నారు.
ఈ కార్యక్రమంలో బీజెపి మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, నియోజకవర్గ నాయకులు నందారెడ్డి, నాయిని ప్రసాద్, ఎక్కలదేవి మధుసూదన్, విజయ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
.