రైతులు ఇబ్బంది పడొద్దు
ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియ సాఫీగా జరగాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి అదనపు కలెక్టర్ మాధురితో కలిసి వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి, సహకార, పౌరసరఫరాల శాఖల అధికారులు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, తదితరులతో ధాన్యం కొనుగోళ్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడవకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు ఎక్కువ సంఖ్యలో టార్పాలిన్స్ ఇవ్వాలని సూచించారు. వ్యవసాయ అధికారులు రైతులు నష్టపోకుండా ప్రత్యేక దృష్టి సారించి, అవసరమైన సహకారాన్ని అందించాలన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు తెలియచేయాలని,
రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని వెంటదివెంట లారీలలో లోడ్ చేయించి కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకుని అధికారుల వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. రైతుల నుండి ఎలాంటి ఫిర్యాదులు రావద్దని, కొనుగోలు కేంద్రాల ఇన్చార్జీలు, ఆయా అధికారులు ఎలాంటి సమస్య లేకుండా
కొనుగోళ్ళు పూర్తి చేయాలని, ఎలాంటి తప్పిదం జరిగినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
రైతులు ధాన్యం తీసుకువచ్చిన వెంటనే తూకం జరిపించాలని, నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని, మిల్లర్లు వచ్చిన ధాన్యం వెంట వెంటనే దింపుకోవాల న్నారు. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకొని సవ్యంగా ధాన్యం మిల్లులకు చేరేలా చూడాలన్నారు. అకాల వర్షాలు కురుస్తున్నందున ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లను అప్రమత్తం చేయాలని, జిల్లాలో ధాన్యం కొనుగోలు సాఫీగా జరిగేలా అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు.
కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు రోజువారిగా ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన పేమెంట్స్ నిర్ణీత సమయంలో గా జరిగేలా చర్యలు తీసుకోవాలనీ సంబంధిత అధికారులకు సూచించారు.
జిల్లాలో 198 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 26,423 మంది రైతుల నుండి 1,44,393 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. 19,532 మంది రైతులకు రూ.236.76 కో ట్లు చెల్లించినట్లు తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ మాధురి, డి ఆర్ డి ఓ శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ అధికారి నర్సింహారావు, డిసిఓ ప్రసాద్, డీఎస్ఓ వనజాత, సివిల్ సప్లైస్ డి ఎం సుగుణ భాయ్, ఏపీఎంలు, డిపిఎంలు, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈఓ లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, కొనుగోలు కేంద్రాల ఇన్చార్జీలు, తదితరులు పాల్గొన్నారు.
.