పద్మక్క పరాభవం... మైనంపల్లి రోహిత్ ఘన విజయం
ఫలించని హరీష్ రావు కృషి
మైనంపల్లి రోహిత్ కు 10,157 ఓట్ల మెజార్టీ
తెలంగాణ ప్రభ (ఉమ్మడి మెదక్ బ్యూరో): మెదక్ ప్రజల ఆత్మగౌరవానికి... సిద్దిపేట జిల్లా పెత్తందారులకు మధ్య జరిగిన పోరులో చివరకు ఆత్మగౌరవమే గెలుపొందింది. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన అధికార పార్టీ బిఆర్ఎస్ కు పరాభవం ఎదురైంది. దశాబ్ద కాలంగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పద్మాదేవేందర్ రెడ్డి మెదక్ నియోజకవర్గంలో తిరుగులేని నాయకురాలిగా ఎదిగారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో ఎలాగైనా హ్యాట్రిక్ సాధించాలని అనుకున్నప్పటికీ మైనంపల్లి రూపంలో ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు వీయడం, మరోవైపు పద్మాదేవేందర్ రెడ్డి ఒంటెద్దు పోకడలకు విసిగిన మెదక్ ప్రజలు ఓటు రూపంలో గుణపాఠం రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
గత పది సంవత్సరాలుగా మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నిస్తేజంగా మారింది. ప్రతి ఎన్నికలో ఆమెకు ప్రత్యర్థిగా నాయకుడు లేకపోవడంతో తన గెలుపుకు ఎదురు లేదన్న ధీమాతో కొనసాగారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీకి వ్యతిరేకత రావడం... గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన మైనంపల్లి హనుమంతరావు మెదక్ నియోజకవర్గంపై దృష్టి సారించి తన తనయుడు మైనంపల్లి రోహిత్ ను బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేయించాలనుకున్నారు. అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంపల్లి హనుమంతరావు తన కొడుకుకు పట్టుబట్టి మెదక్ టికెట్ ఇప్పించారు. దీంతో మెదక్ నియోజకవర్గంలో రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు తనకు ఎదురులేదన్న పద్మా దేవేందర్ రెడ్డి కి గట్టి పోటీ ఏర్పడింది.
అనుకున్నట్లుగానే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే మెదక్ నియోజకవర్గంలో ఎలాగైనా పద్మ రెడ్డిని గెలిపించాలని సంకల్పంతో మంత్రి హరీష్ రావు తీవ్రంగా కృషి చేశారు. కార్యకర్తలను, నాయకులను సమన్వయం చేసి పద్మా రెడ్డిని గెలిపించాలని విశ్వ ప్రయత్నం చేశారు. కానీ నియోజకవర్గంలో పార్టీ పైన, పద్మా రెడ్డి పైన తీవ్రంగా వ్యతిరేకత ఏర్పడడంతో.. ఇది మెదక్ ప్రజల ఆత్మగౌరవానికి, సిద్దిపేట జిల్లా పెత్తందారితనానికి మధ్య జరుగుతున్న పోరు అంటూ మైనంపల్లి రోహిత్ రావు లేవనెత్తిన నినాదం నియోజకవర్గ ప్రజలను ఆలోచింపజేసింది. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా "మార్పు" నినాదం బలంగా వినిపించడంతో మైనంపల్లి రోహిత్ రావుకు గెలుపు వరించింది. ఏదిఏమైనా మెదక్ నియోజకవర్గ ప్రజలు మాత్రం తమ ఆత్మ గౌరవానికి పెద్దపీట వేశారన్నది నగ్న సత్యం.
.