తెలంగాణ ప్రభ, ( ఉమ్మడి మెదక్ బ్యూరో): మెదక్ కాంగ్రెస్ నేతల్లో జోష్ కనిపిస్తోంది. 34 ఏళ్ల తర్వాత అధికారం దక్కడం.. అధికార బీఆర్ఎస్ పార్టీని ఓడించడంతో నేతలంతా ఫుల్ ఖుషీగా ఉన్నారు. మెదక్ అసెంబ్లీ బ్లాక్ పరిధిలోని మెదక్ పట్టణం, మండలం, హవేళి ఘణపురం, పాపన్నపేట మండలాల్లో భారీ లీడ్ రావడంతో ఆ పార్టీ నేతలంతా సోమవారంనాడు మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సొంతం చేసుకున్నారు. మైనంపల్లి రోహిత్ మెదక్ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో క్రియాశీల పాత్ర పోషించిన నేతలతో కలిసి మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అథ్యక్షుడు మహ్మద్ హఫీజ్ క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. మెదక్ మండల పార్టీ అధ్యక్షుడు శంకర్, సీనియర్ కాంగ్రెస్ నేత శ్రీనివాస్ చౌదరి, నేతలు మంగమోహన్, అనీల్, మార్గం నాగరాజు తదితరులు ఉన్నారు.
