నేడే ఓట్ల లెక్కింపు
తేలిపోనున్న అభ్యర్థుల భవితవ్యం
గెలుపు మాదేనంటున్న ప్రధాన పార్టీలు
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): తెలంగాణ శాసనసభ సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం జరగనుంది. ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఓటర్ల తీర్పు ఎవరి వైపు ఉంటుందోనన్న భయాందోళన అభ్యర్థుల్లో నెలకొంది.
తెలంగాణలో ఈనెల 30న ఎన్నికలు నిర్వహించారు. ఇప్పటికే ఈవీఎంలను కట్టుదిట్టమైన భద్రత మధ్య స్ట్రాంగ్ రూములకు తరలించగా శనివారం సాయంత్రం కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లను లెక్కించి తరువాత నియోజకవర్గాల వారీగా ఆయా కౌంటింగ్ కేంద్రాలలో ఓట్లను లెక్కించడం జరుగుతుంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు గాను నిర్వహించిన ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపు, ఓటములపై తర్జనభర్జన పడుతున్నారు. 2018 ఎన్నికల్లో 9 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొంది ప్రభంజనం సృష్టించింది. ఈసారి జరిగిన ఎన్నికల్లో సైతం అదే ఊపును కొనసాగిస్తామని టిఆర్ఎస్ అభ్యర్థులు ధీమాగా ఉన్నప్పటికీ ఓటర్ల తీర్పు పైనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో ప్రజా తీర్పు మార్పు కోరుతుందని స్పష్టమైనప్పటికీ సీఎం కేసీఆర్ తో పాటు ఆయా జిల్లాల మంత్రులు సైతం తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాగా ఉన్నారు.
మరోవైపు ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ కృషి చేసింది. టికెట్ల కేటాయింపులో సైతం ఆచితూచి అడుగులు వేసింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేజార్చకుండా విస్తృతంగా ప్రచారం చేసి మార్పు అనే నినాదంతో ఓట్లను రాబట్టగలిగినట్లు తెలుస్తోంది.
మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై, ప్రభుత్వ తీరుపై విసిగిన ప్రజలు మార్పుకే ఓట్లు వేసినట్లుగా తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి.
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఉమ్మడి మెదక్ జిల్లాలో 5 స్థానాల్లో కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో సిద్దిపేట నియోజకవర్గం మినహాయిస్తే బీఆర్ఎస్ పార్టీకి చాలా క్లిష్టమైన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్ నారాయణఖేడ్ ఆందోల్ కాంగ్రెస్, పటాన్చెరు నియోజకవర్గంలో టిఆర్ఎస్, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడ్డాయి. మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు తథ్యమని సంకేతాలు అందుతున్నాయి. నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీగా తలపడ్డాయి. సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా హరీష్ రావు విజయం దాదాపుగా ఖాయం అయింది. గతంలో కంటే ఈసారి మెజార్టీ తగ్గే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు నాదేనన్న భీమాతో ఉండగా బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు సైతం గట్టి పోటీని ఇచ్చారు. సీఎం కేసీఆర్ కు, బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ కు మధ్య తీవ్రమైన పోటీ నెలకొనగా గెలుపు ఎవరిదనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఏదిఏమైనా బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈసారి గండి పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి..:
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఆదివారం ప్రారంభం అవుతున్నందున ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీ.సీ కెమెరాల ద్వారా అనుక్షణం పర్యవేక్షణ.. సాయుధ బలగాల పహారా మధ్య కౌంటింగ్ ప్రారంభించనున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ నిషేధాజ్ఞలు అమలు చేశారు.
పది నియోజకవర్గాల పరిధిలో ప్రశాంత వాతావరణం నడుమ సాఫీగా పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం, కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను, ఓట్ల లెక్కింపు కేంద్రాలలోని స్ట్రాంగ్ రూమ్ లో భద్రప్రరిచామని ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు తెలిపారు.
కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా మెదక్ - 34 నియోజక వర్గంలో 274 పోలింగ్ కేంద్రాలు,14 టేబుల్స్, 20 రౌండ్స్ , నర్సాపూర్- 37 నియోజక వర్గంలో 305 పోలింగ్ కేంద్రాలు, 14 టేబుల్స్ ,EV+2 పోస్టల్, తో దాదాపు 22 రౌండ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
సంగారెడ్డి నియోజకవర్గంలో 281 పోలింగ్ కేంద్రాలు, 16 టేబుళ్లు, 18 రౌండ్లు, నారాయణఖేడ్ నియోజకవర్గంలో 296 పోలింగ్ కేంద్రాలు, 18 టేబుళ్లు, 17 రౌండ్లు, ఆందోల్ నియోజకవర్గంలో 313 పోలింగ్ కేంద్రాలు, 18 టేబుల్ 18 రౌండ్లు, జహీరాబాద్ నియోజకవర్గంలో 314 పోలింగ్ కేంద్రాలు, 18 టేబుళ్లు, 18 రౌండ్లు, పటాన్చెరు నియోజకవర్గంలో 405 పోలింగ్ కేంద్రాలు, 18 టేబుళ్లు, 23 రౌండ్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద శనివారం సాయంత్రం ఐదు గంటల నుండి సోమవారం ఉదయం 6.00 గంటల వరకు 144 సెక్షన్ నిషేధాజ్ఞలు అమలులోకి ఉంటుందని తెలిపారు.ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి ఇతరులెవరూ లోనికి వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, కౌంటింగ్ టేబుల్స్, ఇతర అన్ని ఏర్పాట్లను నిశితంగా పరిశీలన చేశారు.
.