మెదక్ బిఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): ప్రతి ఎన్నికల్లో ఆడబిడ్డగా ఆదరిస్తూ గెలిపిస్తున్నారని, ఈ ఎన్నికల్లో కూడా అదే తీరున ఓటేసి గెలిపించాలని మెదక్ బిఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మెదక్ పట్టణంలో మంగళవారం కార్యకర్తలు, నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాందాస్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. తెలంగాణ కోసం తన పదవికి రాజీనామా చేయమంటే ఒక్క క్షణం ఆలోచించకుండా రాజీనామా చేసినట్లు చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏడు గంటల కరెంటు ఇచ్చి రైతులను నానా అవస్థలు పెట్టినట్లు చెప్పారు. పెట్టుబడి లేక రైతులు ఆగమాగం అయి ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రo వచ్చిన తర్వాత కరెంటు, సాగు నుంచి కష్టాలు లేవని చెప్పారు. 11 సార్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ 55 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలన చేసిందని, 24 గంటల కరెంట్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మైనంపల్లి హనుమంతరావు రెండుసార్లు గెలిస్తే మెదక్ నియోజకవర్గానికి ఆయన ఏం చేశారో చెప్పాలన్నారు. ఆడబిడ్డగా ఆశీర్వదించి గెలిపించాలని మెదక్ ను ముందంజలో నడిపిస్తానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మెదక్ నియోజకవర్గం ఎన్నికల ఇంచార్జ్ తిరుపతి రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్, మెదక్ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్ పాల్గొన్నారు.
.