మెదక్ లో బీఆర్ఎస్ ఖేల్ ఖతం..

ఓటుతో పద్మ దేవేందర్ రెడ్డి ని  తరిమి కొట్టండి

దోపిడీ దొంగల నుండి దిష్టిబొమ్మలా కాపాడుతా

మెదక్ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారు 

నన్ను గెలిపించండి అభివృద్ధి ఏమిటో చూపిస్తా..

మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): మెదక్ నియోజకవర్గం ప్రజల ఆత్మగౌరవాన్ని సిద్దిపేట అహంకారానికి తాకట్టు పెట్టిన ఘనత ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి దేనని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు ఆరోపించారు. తాను మెదక్ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు దిష్టిబొమ్మల పనిచేస్తానని తెలిపారు. 

మంగళవారం మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన అశేష జనవాహిని సభలో మాట్లాడుతూ.. మెదక్ ఆత్మ గౌరవానికి సిద్దిపేట అహంకారానికి జరుగుతున్న ఎన్నిక అని తెలిపారు. సిద్దిపేటలో జరిగిన అభివృద్ధిని మెదక్ లో జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనించాలని తెలిపారు. మెదక్ లో చిన్నపిల్లలు ఆడుకునేందుకు కనీసం చిన్న పార్క్ అయినా ఉన్నదా అని ప్రశ్నించారు. మెదక్ ప్రజలంటే ఎందుకింత చులకన అని అడిగారు. రెండు సార్లు ఓట్లేసి గెలిపిస్తే ప్రజలను పదేళ్లు మోసం చేసి మెదక్ నియోజకవర్గ అభివృద్ధిని 20 ఏళ్లు అభివృద్ధిలో వెనక్కి నెట్టేశారన్నారు. దళిత బందు, బిసి బందు, డబుల్ బెడ్ రూం ఇల్లు, పింఛన్లు వచ్చాయా అని ప్రశ్నించారు. పదేళ్ల నుంచి మెదక్ కు రాని ముఖ్యమంత్రి రెండు సార్లు రావాల్సిన అవసరం ఏముందని, కాంగ్రెస్ అభ్యర్థి అయిన తనను చూస్తే బీఆర్ఎస్ కు ఎందుకు అంత భయం అవుతుందని ప్రశ్నించారు. పద్మకు రోహిత్ కు ఏమైనా పోలిక ఉందా అని సీఎం కేసీఆర్ అన్నారని, మెదక్ ప్రజలను దుష్ట శక్తుల నుంచి కాపాడేందుకు దిష్టి బొమ్మలా పని చేస్తా అని తెలిపారు. బిడ్డ హరీశ్ కబర్డార్ అని, మెదక్ ప్రజలు తరిమి తరిమి కొడతారన్నారు. మాయమాటలు మోసపు మాటలు చెప్తారని, పైసలు ఇస్తారని, నమ్మొద్దని తెలిపారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను పక్కగా అమలు చేస్తామని, హస్తం గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో సురేందర్ గౌడ్, జీవన్ రావు, అనిల్ కుమార్, లింగం, శేఖర్, రాజేష్, బొజ్జ పవన్, నరేందర్, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

.