సునీత రెడ్డి గెలిస్తే నర్సాపూర్ చార్మినార్ జోన్ లో కలుపుతాం
రోడ్ షోలో హామీ ఇచ్చిన మంత్రి కేటీఆర్
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే తెలంగాణ రాష్ట్రం కటిక చీకటిలో మగ్గుతుందని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలిపారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఆదివారం నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి తో కలిసి రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..నర్సాపూర్ లో రోడ్ షో కి భారీగా తరలివచ్చిన జనాలను చూస్తే సునీతరెడ్డి గెలుపు ఖాయమని అన్నారు. 2014 ముందు కరెంట్ కోసం పడ్డ కష్టాలు గుర్తుంచుకోండి కరెంటు కష్టాలు కాంగ్రెస్ నాయకులకు తెలియదన్నారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీసీ బిడ్డ గొంతు కోసి కాంగ్రెస్ టికెట్ అమ్ముకున్నాడని విమర్శించారు.
కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదని, కరెంటు ఉంటే కాంగ్రెస్ ఉండదని చెప్పారు. కౌలు రైతుకు రైతుబంధు ఇవ్వమని, రైతుబంధు దుబారా అని రేవంత్ రెడ్డి అనడం సిగ్గుచేటు అన్నారు. 70 లక్షల రైతుల ఖాతాల్లో 73000 కోట్లు వేసిన ఘనత కెసిఆర్ దని అన్నారు.
తెలంగాణను నష్టం చేసిన వారు ఒక్క ఛాన్స్ అని వచ్చి అడుగుతున్నారని, రేవంత్ రెడ్డి కొడంగల్ లో, కామారెడ్డిలో ఓడిపోతాడని జోస్యం చెప్పారు.
రైతుబంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బీమా, ఎన్నో సంక్షేమాలు ప్రవేశపెట్టిన కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావడం తత్యమని తెలిపారు.
కాంగ్రెస్, బీజెపి నాయకులు రకరకాల డ్రామాలు వేస్తున్నారని, ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు ఇస్తా అని మోడీ అనలేదా అంటూ ప్రశ్నించారు.
400 రూపాయలు ఉన్న సిలిండర్ 1200 రూపాయలు చేసిన ఘనత మోడీది, తండాలను గ్రామపంచాయతీ చేసిన ఘనత కేసిఆర్ దని చెప్పారు.
సునీత రెడ్డిని గెలిపిస్తే నర్సాపూర్ కు ఐటి హబ్, పరిశ్రమలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేపడుతామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే మదన్ రెడ్డికి సముచిత స్థానం ఉంటుందని, బీఆర్ఎస్ నాయకులకు న్యాయమైన స్థానం కల్పిస్తామన్నారు.
బిఆర్ఎస్ గెలుస్తే నర్సాపూర్ ను చార్మినార్ జోన్ లో కలుపుతామని అఖండ మెజారిటీతో సునీత రెడ్డి ని గెలిపించాలని కోరారు.
.