సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల అవినీతిపై దర్యాప్తు కొనసాగిస్తాం
కాంగ్రెస్కు ఓటేస్తే సుల్తాన్ పాలన... కేసీఆర్ కు ఓటేస్తే నిజాం పాలన
ప్రాజెక్టుల పేరుతో కెసిఆర్ లక్షల కోట్లు దోచుకున్నారు
అమేథి నుంచి రాహుల్ గాంధీ, గజ్వేల్ నుంచి కేసీఆర్ పారిపోయారు
తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఖాయం
తూప్రాన్ సభలో ప్రధాని నరేంద్ర మోడీ
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న కేసీఆర్ తో పాటు ఆ కుటుంబ సభ్యుల అవినీతిపై దర్యాప్తులు కొనసాగుతున్నాయని భారత ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు.
సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ పట్టణంలో ఏర్పాటు చేసిన బీజెపి ఎన్నికల సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు.
కేసీఆర్ ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గం కూడా ఆనందంగా లేదని
అన్నారు. అభివృద్ధి అంటే ఏంటో బీజేపీ ప్రభుత్వం వచ్చాక చూపిస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కేవలం కుటుంబ లబ్ది కోసమే కేసీఆర్ ప్రభుత్వంలోకి రావాలని తహతహలాడుతున్నాడని మండిపడ్డారు.
మరోవైపు అమేథి నియోజకవర్గం నుంచి పారిపోయిన రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు నీతులు చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. అమేథి నుంచి
రాహుల్, గజ్వేల్ నుంచి కేసీఆర్ పారిపోయారని తెలిపారు. నిరుద్యోగులు, మహిళలే కాకుండా రైతులు కూడా కేసీఆర్ ప్రభుత్వంపై
అసహనంతో ఉన్నారని చెప్పారు.
ప్రాజెక్తుల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని అన్నారు. ఆ ప్రాజెక్టుల కోసం రైతుల వద్ద నుంచి భూమి లాక్కొని చిత్రహింసలకు గురిచేశారని గుర్తు చేశారు. తెలంగాణలో సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమని తెలిపారు. దళితుడ్ని ముఖ్యమంత్రి చేస్తామని బీఆర్ఎస్, బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని కాంగ్రెస్ ఇన్నాళ్లు మోసాలకు పాల్పడ్డాయని కానీ బీజేపీలో అలా ఉండదని రేపటి ప్రభుత్వంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే ముఖ్యమంత్రి పదవిలో ఉంటారని అన్నారు. ఇన్నాళ్లు గజ్వేల్ నియోజకవర్గ ప్రజలను నమ్మించి కేసీఆర్ మోసం చేశారని వెల్లడించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సరిగా అమలు చేయలేదని తెలిపారు.
ప్రజలను పట్టించుకోని సీఎం తెలంగాణకు అవసరమా? అని అడిగారు. కేసీఆర్ ను శాశ్వతంగా ఫాంహౌస్ కు పరిమితం చేయాలని ప్రజలు భావిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటే అని ఈ రెండూ కుటుంబ పార్టీలే అని అన్నారు. కాంగ్రెస్ కార్బన్ కాపీయే బీఆర్ఎస్ అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ రెండు పార్టీల పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రతిష్టను పెంచుతుందని చెప్పారు. వర్గీకరణతో మాదిగలకు న్యాయం చేయబోతున్నామని చెప్పారు. కాంగ్రెస్ పాలన ఢిల్లీ సుల్తాన్ లాంటిది, బీఆర్ఎస్ పాలన నిజాం దొర లాంటిదని విమర్శించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో బీజెపి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ సభలో గజ్వేల్, దుబ్బాక, నర్సాపూర్, మెదక్ బీజెపి అభ్యర్థులు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, మురళి యాదవ్, పంజా విజయ్ కుమార్, మెదక్ జిల్లా బిజెపి అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, తాళ్లపల్లి శ్రీనివాస్, నందా రెడ్డి, నాయిని ప్రసాద్, విజయ్ కుమార్, ఎక్కలదేవి మధుసూదన్, ఆయా నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
.