సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): ఎన్నికలలో పోలింగ్ అతి కీలకమైనందున ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్ మైక్రో అబ్జర్వర్లకు సూచించారు.
జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ సరళిని సూక్ష్మ స్థాయిలో పరిశీలించడానికి నియమించబడిన మైక్రో అబ్జర్వర్లకు శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో శిక్షణ తరగతులు నిర్వహించారు.
ఎన్నికలసాధారణ పరిశీలకులు దీపక్ సింగ్లా, పవన్ కుమార్, నజీమ్ జై ఖాన్ లు శిక్షణ కార్యక్రమానికి విచ్చేసి మైక్రో అబ్జర్వర్లకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మైక్రో అబ్జర్వర్లు
ఎన్నికల సంఘం నిబంధనలు తు.చ తప్పకుండా అమలయ్యేలా, ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేలా సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలన్నారు.
మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ కు సంబంధించిన ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన ఏర్పర్చుకోవాలని, అప్పుడే పోలింగ్ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించగలుగు
తారన్నారు. ముఖ్యంగా పోలింగ్ కు ముందు రోజు నుండే తమ పనులు ప్రారంభమైతాయని, పోలింగ్ రోజున నిబంధనలకు అనుగుణంగా మాక్ పోలింగ్ నిర్వహించారా లేదా అన్నది పరిశీలించాలని, తదనంతరం చేపట్టే పోలింగ్ ప్రక్రియలు నిబంధనలకు అనుగుణంగా, పూర్తి పారదర్శకంగా జరుగుతున్నాయా లేదా అన్నది నిశిత పరిశీలన చేయాలని, గమనించిన అంశాలను జనరల్ అబ్జర్వర్ల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. పోలింగ్ కేంద్రంలో సీక్రెట్ పోలింగ్ కంపార్ట్మెంట్ సరిగానే ఏర్పాటు చేశారా అన్నది పరిశీలంచాలని తెలిపారు. ఈ.వి.ఎం లను ఎలా అమరుస్తున్నది పరిశీలించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, ఇతర అధికారులు నిర్వర్తిసున్న విధులను గమనించాలని, టెండర్, ఛాలెంజ్ ఓటింగ్ లు జరిగితే వాటి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.పోలింగ్ ప్రారంభం నుండి పూర్తయ్యేంత వరకు అన్ని అంశాలను గమనిస్తూ, ఎప్పటికప్పుడు వాటిని జనరల్ అబ్జర్వర్ల దృష్టికి తీసుకెళ్లాలని, ఓటింగ్ గోప్యతను కాపాడే విధంగా మైకో అబ్జర్వర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
ఉదయం 7.00 గంటలకు పోలింగ్ ప్రారంభమై, సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుందన్నారు. ఐదు గంటల లోపు పోలింగ్ కేంద్రం లోనికి వచ్చిన ఓటర్లు ఇంకను మిగిలి ఉంటే, వారిని వరుసక్రమంలో నిలబెట్టి చివరి నుండి ముందు వరుసలో ఉన్న ఓటరు వరకు క్రమ సంఖ్య చీటీలు అందించి పోలింగ్ జరిపించాల్సి ఉంటుందన్నారు.
ఈ అంశాలన్నింటినీ మైక్రో అబ్జర్వర్లు తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. సమస్యాత్మక కేంద్రాలలో మరింత ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, పోలింగ్ కేంద్రం బయట, పరిసర ప్రాంతాల్లోనూ జరిగే అంశాలను గమనిస్తూ జాగరూకతతో వ్యవహరించాలని సూచించారు.
నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాల ఎన్నికల జనరల్ అబ్జర్వర్ దీపక్ సింగ్లా మాట్లాడుతూ పోలింగ్ రోజు మైక్రో అబ్జర్వర్ల పాత్ర ప్రతి దశలోనూ కీలకమైనదని అన్నారు. ఎన్నికల ప్రక్రియ పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, 18 అంశాలపై జనరల్ అబ్జర్వర్ కు నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. అన్నివేళలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏవేని సందేహాలు ఉంటే తమను సంప్రదించాలని తెలిపారు.
పటాన్చెరు నియోజకవర్గం జనరల్ అబ్జర్వర్ నజీమ్ జై ఖాన్ మాట్లాడుతూ మైక్రో అబ్జర్వర్లు తమ శిక్షణలో వంద శాతం అవగాహన కలిగించుకోవాలని, పోలింగ్ ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని తమ నివేదికలను సకాలంలో సమర్పించాలని సూచించారు.
సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల
జనరల్ అబ్జర్వర్ పవన్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఎన్నికలలో కొత్తగా మరింత నేర్చుకోవాల్సి ఉంటుందని, మైక్రో అబ్జర్వర్లు ఎలక్షన్ కమిషన్ కు కళ్ళు, చెవుల లాంటి వారన్నారు. పోలింగ్ నకు 90 నిమిషాల ముందు మాక్ పోలింగ్ జరిగేలా చూడాలని, ఉదయం పోలింగ్ ప్రారంభం అయినప్పటి నుండి సాయంత్రం పోలింగ్ పూర్తయ్యే వరకు జరిగే పనుల ప్రక్రియను అత్యంత నిషితంగా పరిశీలించాలని,
ఎలాంటి లోటుపాట్లకు తావివ్వరాదన్నారు. భారత ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు, బాధ్యతగా పనిచేయాలని సూచించారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మైక్రో అబ్జర్వర్ల విధులు, బాధ్యతలపై మాస్టర్ ట్రైనర్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల జనరల్ అబ్జర్వర్లు, డిఆర్ఓ నగేష్, డిప్యూటీ కలెక్టర్ మహిపాల్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ కృష్ణ కుమార్, మైక్రో అబ్జర్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
.