బీజెపి ముస్లింలకు వ్యతిరేకం కాదు : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ

ఉద్యమ ఫలితమే పెరిగిన పింఛన్లు

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): ఎమ్మార్పీఎస్ ఉద్యమ ఫలితమే రెండు వందల రూపాయలు ఉన్న పింఛన్ 2016 అయిందని, మహిళా రిజర్వేషన్ కోసం నాడు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్న భీమ్ రావు అంబేద్కర్ తన పదవికి రాజీనామా చేసిండని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అన్నారు.

బుధవారం నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. పేదల ఆకలి తీర్చాలని ఆకలి కేకల ఉద్యమం చేశానన్నారు.

కులం కాదు మానవత్వం ముఖ్యమని అన్నారు. సామాజిక న్యాయం అమలు చేసింది నరేంద్ర మోడీ బీజెపి ప్రభుత్వమేనని అన్నారు.

బీజెపి ఎప్పుడు కూడా ముస్లింలకు వ్యతిరేకం కాదని ఆయన గుర్తు చేశారు. వాజిపేయ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఇస్లాంకు చెందిన అబ్దుల్ కలాంని రాష్ట్రపతిగా చేశారని, మహిళా రిజర్వేషన్ కేంద్రంలో తెచ్చింది కూడా మోడీ ప్రభుత్వమేనని తెలిపారు. దుబ్బాకలో మూడు పార్టీల మధ్య రాజకీయ యుద్ధం జరుగుతుందని తాను ఏ పార్టీలోకి పోకుండా ఎస్సీ వర్గీకరణే లక్ష్యంగా పని చేస్తున్నానని చెప్పారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఏకమై తమను అభివృద్ధి చేసే పార్టీని గెలిపించాలని సూచించారు. పదవులు ముఖ్యం కాదని అగ్రవర్ణాల మాదిరిగా అందరూ అభివృద్ధి చెందాలనే లక్ష్యంగా పనిచేస్తున్నానని తెలిపారు.

తెలంగాణ క్యాబినెట్లో ఏ ఒక్కరైనా మాదిగ మంత్రి ఉన్నాడా అని బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. దళితులను మోసం చేసిండని సీఎం కేసీఆర్ ని విమర్శించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ కు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశానన్నారు. దళిత, బహుజనులను అణగదొక్కాలని కేసీఆర్ చూస్తున్నారన్నారు. బంగారు దుబ్బాకగా మార్చే వ్యక్తి రఘునందన్ రావు అని,  వచ్చేది బిజెపి ప్రభుత్వమని బిఆర్ఎస్ నాయకులు వాపును చూసి బలుపు అనుకుంటున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు, రాష్ట్ర కార్యదర్శి ఆకుల విజయ, అంబటి బాలేష్ గౌడ్, సుభాష్ రెడ్డి, బద్రి, దొమ్మాట యాదగిరి, అరిగే కృష్ణ, కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సుధారెడ్డి పాల్గొన్నారు.

.