కాంగ్రెస్, బీజెపి రెండూ దొందుదొందే : కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ పై మంత్రి హరీష్ రావు ఫైర్

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): కాంగ్రెస్, బీజెపి పార్టీలు రెండు దొందూ దొందే అని, వారి హయాంలో రాష్ట్రానికి జరిగిన అభివృద్ధి ఏమీ లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి హరీష్ రావు విరుచుకుపడ్డారు.

 సిద్ధిపేట జిల్లా కేంద్రంలో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రావు  మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న హైదరాబాద్ లో మాట్లాడిన మాటల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా ఇయ్యకపోవడానికి ప్రధాన కారణం మోటార్లకు మీటర్లు పెట్టకపోవడమేనని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బిఆర్ఎస్ పార్టీ రైతు పక్షపాతిగా నిలిచిందని ఇప్పటికే కాంగ్రెస్, బీజెపి అధికారంలో ఉన్న పలు రాష్ట్రాల్లో మోటార్లకు మీటర్లు బిగించారని వారికి న్యాయంగా రావాల్సిన నిధులను అందజేసినట్లు కేంద్రమంత్రి తెలిపారని చెప్పారు.

కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతిగా నిలిచిందని రైతులంటే ఎంతో ప్రేమ ఉన్న కెసిఆర్ రైతు బిడ్డగా రైతు పక్షాన నిలిచారని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణాకు ఇవ్వాల్సిన 25వేల కోట్ల రూపాయలు ఇవ్వకపోయినా సరే గాని రైతుల  మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తి లేదని తెగేసి చెప్పిన కేసిఆర్ ను కాపాడుకోవాలని, ఈ ఎన్నికల్లో రైతు పక్షపాతిగా నిలిచిన పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

అనంతరం దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డిలో దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సంధర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలో 

గత ఎన్నికల్లో వేరే పార్టీ అభ్యర్థిని గెలిపించి తనను దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ఇబ్బంది పెట్టారని ఈ దుబ్బాక నియోజకవర్గంలో మాటల మనిషిని కాక చేతల్లో అభివృద్ధిని చూపించే కొత్త ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి దిశలో పయనించేలా ఓట్లు వేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

.