ఎలాంటి ప్రలోభాలకు లోనుకావద్దు
సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్
బుల్లెట్ కన్నా బ్యాలెట్ గొప్పది : జిల్లా ఎస్పీ రూపేష్
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): ఓటు హక్కు గల ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్ పిలుపునిచ్చారు.
స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా ఉద్యోగులు, అధికారులు, కళాకారులు, వివిధ వర్గాల ప్రజలు, యువత, విద్యార్థులు యువజన సంఘాల ప్రతినిధులు,
స్వచ్ఛంద సంస్థలు, ట్రాన్స్ జెండర్లు, భద్రతా దళాలు, మహిళలతో మంగళవారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ నుండి అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్స్ వరకు పెద్ద ఎత్తున ఓటరు అవగాహన ర్యాలీని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంటుందని, జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన అర్హులు అందరిని ఓటరుగా నమోదు చేశామన్నారు.
ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే అవకాశం ఒక్క ఓటుకు మాత్రమే ఉందని, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకునేలా చైతన్య పరచాలని కోరారు.
ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నైతికంగా ఓటు వేయాలని సూచించారు.
ఓటు విలువ తెలుసుకుని కచ్చితంగా తమ ఓటు ను వేయాలన్నారు.
జిల్లా ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ ఓటు వజ్రాయుధం లాంటిదని, బుల్లెట్ కన్నా బ్యాలెట్ ఎంతో గొప్పదన్నారు. ఓటు మన హక్కుని, ప్రజాస్వామ్యంలో గొప్ప ఘట్టం ఎన్నికలన్నారు. విద్యార్థులు, యువత తాము ఓటు వేయడంతో పాటు తమ ఇంట్లో అందరూ ఓటు వేసేలా చైతన్య పర్చాలన్నారు.
మన అభివృద్ధికి రాజ్యాంగం ఇచ్చిన ఆయుధం ఓటని, మన దేశ ,రాష్ట్ర, జిల్లా అభివృద్ధికి మంచి నాయకున్ని ఎన్నుకోవడంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అదనపు ఎస్పి అశోక్, జిల్లా అధికారులు, డిఆర్ఓ నగేష్, ఉద్యోగులు, యువత, యువజన సంఘాల, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు,
విద్యార్థులు, ట్రాన్స్ జెండర్లు, మహిళలు, వివిధ వర్గాల ప్రజలు, కళాకారులు, ప్రత్యేక భద్రతా దళాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
.