బిఆర్ఎస్ తోనే ఉద్యోగుల సమస్యల పరిష్కారం

పిఆర్టియు రాష్ట్ర మాజీ అధ్యక్షులు మోహన్ రెడ్డి

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని పి ఆర్ టి యు రాష్ట్ర మాజీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ లోని టిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో  ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను  26 ఏళ్ల పాటు పి ఆర్ టి యు రాష్ట్ర అధ్యక్షునిగా  పనిచేశానని , ఉద్యోగుల సమస్యలు తనకు తెలుసన్నారు. వాటిని పరిష్కరించే ఏకైక ప్రభుత్వం  బిఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు  సంక్షేమ ఫలాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కింది అన్నారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తూ  24 గంటలు ఉచిత కరెంట్ , రైతు బంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. రిటైర్డ్ ఉద్యోగస్తులకు హెల్త్ కార్డు చేసి  కార్పొరేట్ ఆసుపత్రిలో  మెరుగైన వైద్యం  అందించనున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి అధికారంలోకి వస్తేనే ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పారు. మెదక్ లో  బి ఆర్ ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి గారికి ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఉద్యోగస్తులు, కార్మికులు సంపూర్ణ మద్దతి ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మెదక్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్ కిషోర్, నాయకులు లింగారెడ్డి పాల్గొన్నారు.

.