బీఆర్ఎస్ ను బొంద పెట్టడం ఖాయం.. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి

తెలంగాణను తాగుబోతుల అడ్డాగా మార్చిన కేసీఆర్

కెసిఆర్ ను ఫామ్ హౌస్ కు తరలిస్తాం

ఇందిరమ్మ రాజ్యం లేకుంటే కెసిఆర్ కుటుంబం అడుక్కుతినేది

నర్సాపూర్ కాంగ్రెస్ విజయభేరి సభలో టిపిసిసి చీఫ్  రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లిందని.. ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారని.. రాబోయేది ఇందిరమ్మ రాజ్యమేనని..కెసిఆర్ ను ఫామ్ హౌస్ కు తరలించడం ఖాయమని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

నర్సాపూర్ పట్టణంలో కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యం లేకుంటే, సోనియమ్మ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం గుడి మెట్ల కాడనో, దర్గా దగ్గరో బిక్షం ఎత్తుకునే వాళ్లన్నారు. నర్సాపూర్ సభలో మాట్లాడిన ఆయన ఈ సారి కేసీఆర్ ని ఇంటికి పంపాలని ప్రజలు నిర్ణయించారన్నారు. తెలంగాణను బెల్ట్ షాపుల రాష్ట్రంగా మార్చారన్నారు. నిరుద్యోగులు, రైతులు.. ఇలా అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేశారన్నారు. తన దోస్తు అని చెప్పి సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి నమ్మక ద్రోహం చేసారని, ప్రజలను మోసం చేయడం కేసీఆర్ కు ఒక లెక్కా అని ఆయన అన్నారు. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి… బై బై కేసీఆర్ అంటూ ప్రజలతో అనిపించి వారిలో ఉత్సాహం నింపారు.

పార్టీ ఫిరాయించిన ఒక నమ్మక ద్రోహికి బీఆర్ఎస్ ఇక్కడ టికెట్ ఇచ్చింది.. నర్సాపూర్ ను చార్మినార్ జోన్ లో కలిపే అంశాన్ని కాంగ్రెస్ పరిగణనలోకి తీసుకుంటుంది.. నర్సాపూర్ లాంబాడి సోదరుల అడ్డా.. లాంబాడాల అభివృద్ధికి ఈ ప్రభుత్వం చేసిందేం లేదు అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

అధికారంలోకి రాగానే నర్సాపూర్ పరిధిలోని లంబాడా తండాల అభివృద్ధి కోసం రూ.100 కోట్ల ప్రత్యేక నిధులు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ది అని రేవంత్ రెడ్డి అన్నారు. బంగారు తెలంగాణ చేస్తామన్న కేసీఆర్ బొందలగడ్డ తెలంగాణగా మార్చారు.. మాట్లాడితే కేసీఆర్ తెలంగాణ నెంబర్-1 అని చెప్తుండు.. రైతుల ఆత్మహత్యల్లో నెంబర్-1 …నిరుద్యోగ సమస్యల్లో నెంబర్ వన్.. దేశంలోనే నెంబర్-1 తాగుబోతుల అడ్డాగా తెలంగాణను మార్చారు అని ఆయన తెలిపారు.   ఇందిరమ్మ రాజ్యం అంటే ఆకలి కేకల రాజ్యం అని కేసీఆర్ అంటుండు.. ఇందిరమ్మ రాజ్యం అంటే మా లాంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చిన పార్టీ ఇందిరమ్మ రాజ్యం అని రేవంత్ రెడ్డి అన్నారు.

భూమి ఆత్మగౌరవం..

25లక్షల ఎకరాల అసైన్డ్ భూములను పంచిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం.. దళితులు ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేసింది ఇందిరమ్మ రాజ్యం.. పోడు భూములకు పట్టాలు ఇచ్చిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం.. సాగునీటి ప్రాజెక్టులు కట్టి వ్యవసాయానికి సాగునీరు అందించిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం.. స్థానిక సంస్థల్లో ఆడబిడ్డలకు రిజర్వేషన్లు కల్పించిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం.. ఇందిరమ్మ రాజ్యం లేకపోతే.. సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ కుటుంబం అడక్కు తినేది.. కేసీఆర్, సిద్దిపేటలో సింగిల్ విండో డైరెక్టర్ గా నీకు అవకాశం ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యం.. కాంగ్రెస్ కాదా? కేసీఆర్.. ఆనాడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నిన్ను నియమించిన సంజయ్ గాంధీ ఇందిరమ్మ కొడుకు అనే సంగతి మరిచిపోయావా? అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

భారీగా తరలివచ్చిన జనం.. 

నర్సాపూర్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విజయభేరి సభకు నియోజకవర్గం నుండి భారీగా కార్యకర్తలు రైతులు మహిళలు తరలివచ్చారు. సభా ప్రాంగణం జనంతో నిండిపోయింది.

ఈ సభకు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్, నర్సాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి  ఆవుల రాజిరెడ్డి, నాయకులు సుహాసిని రెడ్డి, సుజాత, శేష సాయి రెడ్డి, సుధీర్ రెడ్డి, అంజా నేయులు గౌడ్, శ్రీనివాస్ గుప్త, కమలా పూల్ సింగ్ పాల్గొన్నారు.

.