ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి
డిప్యూటీ సీఎం, మంత్రులతో కలిసి పరిశీలన
కూసుమంచి, (తెలంగాణ ప్రభ): క్రీ.శ. ఒకటో శతాబ్ద కాలానికి చెందిన నేలకొండపల్లి వద్ద గల బౌద్ధ క్షేత్రాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుదామని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, సీపీ సునీల్ దత్ తో కలిసి బౌద్ధ స్తూపం చుట్టూ తిరిగి.. అక్కడి పరిసరాల్లో కలియతిరిగి పరిశీలించారు. ఆర్కియాలజీ డిప్యూటీ డైరెక్టర్, అధికారుల ద్వారా పూర్తి వివరాలు తెలుసుకున్నారు. పర్యాటకులను, బౌద్ధ భిక్షువులను ఆకట్టుకునేలా అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉందని, అందుకు అనుగుణంగా పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాల్సి ఉందని అన్నారు. ఇక్కడి స్థూపం దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దది కావడం విశేషమని, శతాబ్దాల చరిత్ర కలిగిన దీని ఆనవాళ్లు పదిలంగా ఉండేలా పనులకు ప్రణాళిక రూపొందించాలన్నారు. ఈ క్షేత్రం వెంట ఉన్న చెరువులో బోటింగ్ ఏర్పాటు చేసి సందర్శకులు, పర్యాటకులను ఆకట్టుకోవచ్చని అన్నారు. ఉప ముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు, ఎంపీ స్వయంగా ఈ ప్రాంతానికి వచ్చి పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తామని అభయం ఇవ్వడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
భక్త రామదాసు గృహ సందర్శన
తెలుగు వాగ్గేయకార ఆద్యులు, భద్రాచల శ్రీ సీతారామ దేవస్థానం నిర్మించిన భక్త రామదాసు(కంచర్ల గోపన్న) నాలుగు శతాబ్దాల కిందట జీవించిన నేలకొండపల్లిలోని ఆయన స్వగృహాన్ని, పక్కనే నిర్మాణంలో ఉన్న నూతన ధ్యాన మందిరాన్ని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి సందర్శించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు లతో కలిసి అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. భక్త రామదాసు వినియోగించిన బావిని స్వయంగా పరిశీలించారు. అప్పటి విశేషాలను అర్చకులు, స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శాఖమూరి రమేష్, నాయకులు నెల్లూరి భద్రయ్య, కొడాలి గోవిందరావు, కొప్పుల చంద్రశేఖర్ రావు, వెన్నపూసల సీతారాములు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు .బొడ్డు బొందయ్య,, నాగేశ్వరరావు, చిత్తూరి అచ్చయ్య, మామిడి వెంకన్న, వేగినీటి లక్ష్మీ నరసయ్య, బచ్చలకూరి నాగరాజు, మైసా శంకర్, షేక్ మదర్ సాహెబ్, అంజిని, బోయిన వేణు, సీత, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
