తెలంగాణ ప్రభ (కోరుట్ల): జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు కోరుట్ల మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి ఉదయం పూట పారిశుద్ధ్య పనులను పర్యవేక్షణ చేస్తూ వర్షాకాలం దృశ్య డెంగ్యూ మలేరియా మరియు ఇతర అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ బట్టు తిరుపతి మాట్లాడుతూ ప్రతి వార్డులోని కొన్ని ఇళ్లలో నిల్వ ఉన్నటువంటి నీటిని తీయించడం జరిగింది. అంటు వ్యాధులు ప్రబలకుండా ఈ క్రింది జాగ్రత్తలు పాటించాలని పట్టణ ప్రజలకు ఆయన తెలియజేశారు.
ఇంటి ఆవరణలో నిలువ నీటిని ఉంచుకోకూడదు.
ఇంటి చుట్టూ ఎలాంటి చెత్తాచెదారం లేకుండా చూడాలి.
దోమలు గుడ్లు పెట్టి పెరుగుదలకు అనుకూలంగా ఉండే పూల కుండీలు, డ్రమ్ములు, పాత టైర్లు, కూలర్లు, కొబ్బరి చిప్పలు మరియు మూత పెట్టని నీళ్ల కుండీలలో నిలువ నీరు ఉండకుండా చూసుకోవాలి.
ప్లాస్టిక్ వ్యర్థాలను, పాత సామాన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.
దోమ కాటు బారి నుండి తప్పించుకునేందుకు దోమతెరలను, నివారణ మందులను ఉపయోగించాలి.
చేతులు, కాళ్ళు పూర్తిగా కప్పి ఉంచే పొడవాటి దుస్తులను మాత్రమే ధరించాలి.
సాయంత్రం వేళలో కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి.
నీటి నిల్వలు గల వాటిని ఖాళీ చేసి డ్రై డే ను పాటించాలి.
ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు ఈ కార్యక్రమంలో పాల్గొని మీ ఇంట్లో మరియు ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకోవాలి.
ప్రజలందరూ పైన తెలిపిన సూచనలు పాటించి వ్యాధుల బారి నుండి దూరంగా ఉండాలని ఆయన సూచించారు
.