గుంత ప్రాంతాన్ని పరిశీలించిన సీపీఎం నేత.
తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల పక్కన గల ప్రమాదకర గుంతను పూడ్చి వేసి విద్యార్థులకు రక్షణ కల్పించాలని సీపీఎం పార్టీ ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి గుంత ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. గత ప్రభుత్వం ఏడు కోట్లతో రెసిడెన్షియల్ పాఠశాల భవనం నిర్మించి, గుంత పూడ్చడం మర్చిపోయారన్నారు. సుమారు 350 మంది విద్యార్థులకు గుంత యమగండంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గుంత పూడ్చితే విద్యార్థులకు క్రీడ మైదానంగా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ప్రమాదాలు జరగకముందే ప్రభుత్వం, అధికారులు మేల్కొంటే బాగుంటుందని పేర్కొన్నారు. వర్షపు నీరుతో గుంత నిండితే విద్యార్థులతో పాటు, పశువులకు ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
