తిరస్కరణ ఓటు హక్కును వినియోగించుకున్న సుంకర నరేష్

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) హైకోర్టు న్యాయవాది సుంకర నరేష్ తిరస్కరణ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం కమలానగర్ లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ లోని పోలింగ్ స్టేషన్ లో రూల్ 49 (O) ఎన్నికల నియమావళి 1961 ప్రకారం తిరస్కరణ ఓటు హక్కును ఆయన వినియోగించుకున్నారు. ఇందు కోసం పోలింగ్‌ బూత్‌లోని ప్రిసైడింగ్‌ అధికారి వద్ద 17-ఎ ఫారం తీసుకుని ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థులందరిని తిరస్కరిస్తున్నానని పేర్కొంటూ సంతకం పెట్టి సదరు బూత్ ఎన్నికల అధికారికి ఆ పత్రం అంద చేసారు. ఎన్నికలప్పుడు   యువత బయటికి వచ్చి వోట్ వేయకపోవడం చేత, మద్యం, ధనం, విలువైన బహుమతులతో ఓటర్లని ప్రలోభ పెడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కఠినమైన చర్యలు తీసుకోవలసిన ఎన్నికల సంఘం మొద్దు నిద్ర పోతు ఎదో ఒక పార్టీకి కొమ్ము కాస్తుందని ఆయన ఆరోపించారు. గత సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంగా ఇవన్నీ ప్రత్యక్షంగా చూశానని అన్నారు. చట్టంలో ఉన్న ఇటువంటి అవకాశాన్ని సమాజం దృష్టికి తీసుకురావడం వలన ఎన్నికల ప్రక్రియలో కొంతైన మార్పు వస్తుందని భావించి ఈ ప్రయత్నం చేసినట్లు తెలిపారు. ఈ పద్దతిలో నోటాకి కూడ ఓటు వేయకుండా, ఓటింగ్ విధానానికి దూరంగా ఉండటమని అర్థమన్నారు. కాబట్టి ఓటరు బహిర్గతంగా తన అభిప్రాయాన్ని తెలియజేయవచ్చునన్నారు. కానీ నోటాకి ఓటు వేసిన వారు ఆలా తెలపడం చట్ట విరుద్ధమన్నారు.

.