ఓటు... ఆరు విధాలు

తెలంగాణ ప్రభ:  ఓటున్న ప్రతి పౌరుడూ తెలుసుకోవాల్సిన ఓటు వేసే ఆరు  విధానాలను జగిత్యాల పట్టణ న్యాయవాది ,సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఇలా వివరించారు. 18 ఏళ్లు నిండిన వారంతా ఓటరు జాబితాలో నమోదయ్యాక... వారికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు నేరుగా వెళ్లి ఓటేయాలి. కొన్ని అసాధారణ సందర్భాలలో నేరుగా ఓటు వేయడం సాధ్యం కాదు. అలాంటి వారికి మరో నాలుగు విధాలుగా ఓటేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. అయితే... సంబంధిత ఓటరు ఎన్నికల సంఘం విధించిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

సాధారణ ఓటు: 18 ఏళ్లు నిండిన, ఓటుహక్కు కలిగిన ప్రతి పౌరుడు పోలింగ్‌ కేంద్రాల్లో నేరుగా ఓటు వేయడాన్ని సాధారణ ఓటు అంటారు.

పోస్టల్‌ బ్యాలెట్‌: ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు,  ఉద్యోగులు,ఉపాధ్యాయులుసిబ్బంది పోలింగ్‌ రోజున... తమ స్వస్థలాలకు వెళ్లి ఓటేసే అవకాశముండదు. ఇలాంటి వారికి తపాలా బ్యాలెట్‌ ద్వారా ఓటును వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు.

సర్వీస్‌ ఓటు: సైనికులు, పారామిలిటరీ దళాల్లోని ఉద్యోగులు, సిబ్బంది... విధుల నిర్వహణలో భాగంగా దూరప్రాంతాల్లో ఉంటారు. వీరు తమ స్వగ్రామాల్లో ఓటు హక్కును వినియోగించుకునేలా సర్వీస్‌ ఓట్ల విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.

ప్రాక్సీ ఓటు: అంటే... తమకు బదులుగా ఇతరులను పంపి ఓటు వేయడం. పోలీసు, రక్షణ శాఖల్లోని ఇంటెలిజెన్స్‌, గూఢచారి సిబ్బంది ఎవరికీ తెలియకుండా విధులు నిర్వహిస్తుంటారు. వారు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఈ అవకాశం కల్పించారు. 

టెండర్‌ ఓటు: జాబితాలో పేరుండీ, పోలింగ్‌ కేంద్రం వద్దకు వెళ్లేసరికి తమ ఓటును వేరొకరు వేశారని తెలిశాక ఏమిచేయాలో పాలుపోని పరిస్థితిలో ఉన్న వారికి టెండర్‌ ఓటు ఇస్తారు. అయితే, తాను అంతకుముందు ఓటు వేయలేదని ఆ ఓటరు పోలింగ్‌ సిబ్బంది వద్ద నిరూపించుకోగలగాలి.               

వృద్ధులకు,అంగవైకల్యం వారికి ఇంటి నుంచే ఓటు సౌకర్యం.

85 ఏళ్ల వృద్ధులకు ,40 శాతం పైగా అంగవైకల్యం గలవారికి ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యం కేంద్ర ఎన్నికల కమిషన్ కల్పించింది.ఫారం 12 డి ద్వారా దరఖాస్తు చేసుకున్న అర్హులకు ఈ సౌకర్యం ఉంటుంది.

.