మెదక్ కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు
పట్టుకోసం బీజేపీ, కాంగ్రెస్....పరువుకోసం బీఆర్ఎస్
మెదక్ బరిలో త్రిముఖ పోటీ
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): మెదక్ పార్లమెంట్ స్థానానికి ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుండి అభ్యర్థుల ఖరారు పూర్తయింది. ఇక ఎన్నికల పోరుబాట మాత్రమే మిగిలింది. బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు, బీఆర్ఎస్ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డిని ఇప్పటికే ప్రకటించగా కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో ఏఐసీసీ అధిష్టానం తర్జనభర్జనలు పడి చివరికి సామాజికవర్గానికి చెందిన నీలం మధుకు టికెట్టును కేటాయించింది. దీంతో ఈ స్థానానికి త్రిముఖ పోరు నెలకొంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్‌కు పార్లమెంట్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇప్పటికే 17 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన బీఆర్ఎస్ అధిక సీట్లను గెలుపొంది పరువు నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు ప్రాతినిద్యం వహిస్తున్న మెదక్ పార్లమెంట్ సీటును ఎలాగైనా కైవసం చేసుకోవాలని ప్రణాళికలు సిద్దం చేస్తోంది. మెదక్ లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా అందులో ఆరింట బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందారు. దీంతో మెదక్ సీటు బీఆర్ఎస్‌కే దక్కతుందని ధీమాతో ఉన్నారు. అయితే మారుతున్న రాజకీయ పరిణామాలు...సొంత పార్టీ నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడుతుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ సీటును ఆశించిన వంటేరు ప్రతాప్‌రెడ్డికి మొండిచేయి చూపించడంతో ఆయన పార్టీ మారుతున్నట్లు ప్రచారం సాగింది. తాజాగా గజ్వేల్‌కు చెందిన ఎలక్షన్‌రెడ్డి సైతం బీఆర్ఎస్‌ను వీడే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అంతేగాకుండా పలువురు ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిణామాల వద్ద అనూహ్యంగా మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి బీఆర్ఎస్ టికెట్టు కేటాయించడం పట్ల సొంత పార్టీ నేతల నుండి విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్‌కు, మాజీ మంత్రి హరీష్‌రావుకు సవాల్‌గా మారిందని భావిస్తున్నారు. అంతేగాకుండా మెదక్ లోక్‌సభ సెగ్మెంట్‌లో బీఆర్ఎస్‌కు 2.40 లక్షల ఓట్ల మెజార్టీ లభించింది. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్‌రావు సంగారెడ్డి, మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్లలో క్యాడర్‌ను సన్నద్ధం చేసేందుకు సమావేశాలు నిర్వహించారు. మిగతా సెగ్మెంట్లలో కూడా మీటింగ్లు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
గెలుపుపై బీజేపీ ధీమా...
మెదక్ బీజేపీ అభ్యర్థిగా దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు బరిలో ఉన్నారు. అందరికంటే ముందుగా మొదటి జాబితాలోనే రఘునందన్‌రావుకు టికెట్టు కేటాయించడంతో ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రధాని మోడీ చరిష్మా, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూనే ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు..ఫోన్ ట్యాంపరింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రధాన ముద్దాయిగా టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనపై విమర్శలు చేస్తూ మెదక్ సీటును బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రఘునందన్‌రావు ఆయా సెగ్మెంట్లలో సుడిగాలి పర్యటన చేస్తూ కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ సామాజిక న్యాయం గెలిపిస్తుందా...?
మెదక్ సీటుపై కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే విషయంలో తీవ్ర ఉత్కంఠకు గురి చేసిన అధిష్టానం చివరకు సామాజిక న్యాయం చేసింది. అందులో భాగంగానే ఈ స్థానానికి బీసీ నేత, పటాన్‌చెరుకు చెందిన నీలం మధుకు టికెట్టు ఖరారు చేసింది. నీలం మధు గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తూ పలు పదవులను అలంకరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్‌చెరు టికెట్టు ఆశించినా బీఆర్ఎస్ నిరాకరించడం, కాంగ్రెస్ పార్టీలో సైతం భంగపడడంతో బీఎస్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. కానీ ఈ ఎన్నికల్లో నీలం మధుకు సామాజిక ఓట్లు బలంగానే పడ్డాయి. తదనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి మెదక్ ఎంపీ టికెట్ కోరిన విషయం తెలిసిందే. అధిష్టానం సైతం మధుకే టికెట్టు కేటాయించడం జరిగింది. బీసీ నేతగా, సామాజిక సేవతో గుర్తింపు పొందిన నీలం మధుకు బలమైన బీజేపీ, బీఆర్ఎస్ ప్రత్యర్థులను ఎలా కట్టడి చేస్తారో వేచి చూడాల్సిందే. మరోవైపు బీఆర్ఎస్ నుండి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడం మంచి పరిణామం అయినప్పటికీ వారందరినీ కలుపుకొని గెలుపుబాట వైపు పయనించడానికి తీవ్ర కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జాతీయ పార్టీ నుండి పోటీ చేసే అవకాశం లభించడం, ముదిరాజ్ సామాజికవర్గం బలంగా ఉన్న నియోజకవర్గంలో ఓట్లు రాబట్టడం కోసం నీలం మధు ఏ విధంగా సఫలం పొందుతారో వేచిచూడాల్సిందే.
