ఫోన్ ట్యాపింగ్‌లో మొద‌టి ముద్దాయి కేసీఆర్‌

సీఎం రేవంత్‌రెడ్డి, హ‌రీష్‌రావు ర‌హ‌స్య చ‌ర్చ‌లు

బీజేపీ మెద‌క్ ఎంపీ అభ్య‌ర్థి ర‌ఘునంద‌న్‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ ప్ర‌భ ( ఉమ్మ‌డి మెద‌క్ బ్యూరో ): రాష్ట్రంలో సంచ‌ల‌నం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంలో మొద‌టి నిందితుడు కేసీఆర్ అని బీజేపీ మెద‌క్ ఎంపీ అభ్య‌ర్థి ర‌ఘునంద‌న్‌రావు తీవ్ర‌ వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం సంగారెడ్డి జిల్లా కంది ప‌రిధిలోని బీజేపీ జిల్లా కార్యాల‌యంలో ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడారు. కేసీఆర్ అధికారంలోకి రాగానే ఉన్న‌తాధికారుల ద్వారా మొద‌టి బాధితుడు రేవంత్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయించార‌ని ఆరోపించారు. ఓటుకు నోటు కేసు వ్య‌వ‌హారంలో రేవంత్‌రెడ్డిపై ఫోన్ ట్యాపింగ్ చేయించి జైలుకు పంపించార‌ని తెలిపారు. సొంత కూతురు పెళ్ళికి పెరోల్‌పై రావాల్సిన ప‌రిస్థితి తీసుకురావ‌డం దారుణ‌మ‌న్నారు. ఈ వ్య‌వ‌హారానికి సూత్ర‌ధారి అయ‌న కేసీఆర్‌ని ఈ కేసులో ఏ-1గా చేర్చాల‌న్నారు. తాను దుబ్బాక‌లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన‌ప్పుడు కూడా త‌న ఫోన్‌తో పాటు త‌న కుటుంబ స‌భ్యుల ఫోన్లు ట్యాపింగ్ ద్వారా విన్నార‌ని ఆరోపించారు. ఇందులో మాజీ మంత్రి హ‌రీష్‌రావుతో పాటు అప్ప‌టి క‌లెక్ట‌ర్, ప్ర‌స్తుత ఎంపీ అభ్య‌ర్థి వెంక‌ట్రామిరెడ్డి పాత్ర కూడా ఉంద‌ని ఆరోపించారు. వారిని కూడా నిందితులుగా చేర్చాల‌ని డిమాండ్ చేశారు. అస‌లైన నిందితుల‌ను ప‌క్క‌న‌బెట్టి కొంత‌మంది అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకొని చేతులు దులుపుకోవ‌డం స‌రికాద‌న్నారు. ఇప్ప‌టికైనా సీఎం రేవంత్‌రెడ్డి ఈ వ్య‌వ‌హారాన్ని చీఫ్ జ‌స్టిస్‌తో గానీ, సీబీఐకి గానీ అప్ప‌గించి అస‌లైన నిందితుల‌కు శిక్ష ప‌డేలా చూడాల‌ని ర‌ఘునంద‌న్‌రావు డిమాండ్ చేశారు. 

సీఎంతో హ‌రీష్‌రావు చ‌ర్చ‌ల ర‌హ‌స్యం ఏమిటి 

కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్‌రెడ్డికి గ‌త‌నెల 19న పిలువువ‌చ్చింద‌ని, సీఎం ఏ10389 బిజినెస్ క్లాస్ ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీకి రాత్రి 10.15 గంట‌ల‌కు బ‌య‌లుదేరార‌ని తెలిపారు. అదే విమానంలో మాజీ మంత్రి హ‌రీష్‌రావు కూడా వెళ్లార‌ని, రెండు గంట‌ల ప్ర‌యాణంలో సీఎంతో హ‌రీష్‌రావు ఏం చ‌ర్చ‌లు జ‌రిపార‌ని ర‌ఘునంద‌న్‌రావు ప్ర‌శ్నించారు. ఫోన్ ట్యాపింగ్ నుంచి త‌న‌ను త‌ప్పించాల‌ని కోరారా..లేక త‌మ పార్టీ వారంద‌రినీ కాంగ్రెస్‌లోకి వ‌చ్చేలా చూస్తాన‌ని హామీనిచ్చారా అనే విష‌యాలు తేట‌తెల్లం కావాల‌ని డిమండ్ చేశారు. అలాగే హ‌రీష్‌రావు త‌న బినామీల ద్వారా న‌డిపిస్తున్న ఓ టీవీ ఛాన‌ల్ పాత్ర కీల‌కంగా ఈ కేసులో ఉన్నందున ఎందుకు ఆ సంస్థ‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. ఈ స‌మావేశంలో బీజేపీ జిల్లా అధ్య‌క్షురాలు గోదావ‌రి అంజిరెడ్డి, రాష్ట్ర నాయ‌కులు పులిమామిడి రాజు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్య‌క్షులు జ‌గ‌న్‌, ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు ద్వార‌క ర‌వి, మాజీ ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు ర‌విశంక‌ర్ పాల్గొన్నారు.

.