మోడీ ఆశీర్వాదంతోనే రేవంత్ పాలన
నచ్చినోళ్ళకు సీట్లు..నచ్చనోళ్ళకు జైలు బీజేపీ వైఖరి
ఎమ్మెల్సీ కవిత అరెస్టు అక్రమం
వెంకట్రామిరెడ్డిని మెదక్ ఎంపీగా గెలిపించాలి
మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు
తెలంగాణ ప్రభ (ఉమ్మడి మెదక్ బ్యూరో ): బడే భాయ్ మోడీ ఆశీర్వాదంతోనే చోటే భాయ్ రేవంత్‌రెడ్డి పాలన సాగుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు దుయ్యబట్టారు. బుధవారం మెదక్ పార్లమెంట్ పరిధి కార్యకర్తల సమావేశాలను సంగారెడ్డి, మెదక్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బడే భాయ్..చోటే భాయ్ ఇద్దరు మిలాఖత్ అయ్యారని, నచ్చినవాళ్లకు సీట్లు...నచ్చనివాళ్ళను జైలుకు పంపడమే బీజేపీ వైఖరని దుయ్యబట్టారు. వారితో ఒప్పందం చేసుకుంటే కవితను అరెస్టు చేసేవారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీది ఒకే ఎజెండా అని, తెలంగాణ హక్కులను కాపాడేది కేసిఆర్ మాత్రమేనన్నారు. రెండు లక్షల రుణమాఫీ మాట తప్పి ఓటర్లను, రైతులను నమ్మించి మోసం చేశారని విమర్శించారు. పంటలు ఎండుతుంటే సీఎం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడని ఏద్దేవా చేశారు. రఘునందన్‌రావు మంచివాడైతే దుబ్బాకలో ఎందుకు ఓడిపోయాడని ప్రశ్నించారు. వెంకట్రామిరెడ్డిని మెదక్ ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పేద విద్యార్థుల కోసం రూ.100 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన రెండు లక్షల రుణమాఫీ బోగస్ అని, 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని చెప్పారు. వంద రోజుల పాలన చూసి ఓటు వేయాలని సూచించారు. బడ్జెట్‌లోనూ ముస్లింలకు నిధుల కోత విధించారని, రంజాన్ తోఫా కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.
కవిత అరెస్టు అక్రమం...
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు అక్రమమని హరీష్‌రావు ఆరోపించారు. నచ్చినోళ్ళు జేబులో...నచ్చనోళ్లు జైల్లో ఉంచడమే బీజేపీ వైఖరని దుయ్యబట్టారు. తాము వారితో ఒప్పందం చేసుకుంటే కవిత అరెస్టు అయ్యేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒక్కటేనని స్పష్టం చేశారు. రెండు పార్టీలు కలిసి తెలంగాణ ప్రజలను, రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునీతారెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
