ట్రబుల్ షూటర్‌కు అగ్ని పరీక్ష
కేడర్ "చే"జారుతుంటే ఆపేదెలా ?
పార్టీ మారనున్న వంటేరు ప్రతాప్‌రెడ్డి ?
మెదక్ ఎంపీ టికెట్టు దక్కలేదని ఫిరాయింపు
కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం
చేర్చుకోవద్దంటున్న గజ్వేల్ కాంగ్రెస్ నేతలు
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకూ ఇదే పరిస్థితి
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి గందరగోళంగా తయారైంది. పది అసెంబ్లీ స్థానాలకు గాను ఏడు స్థానాలను గెలుపొందినప్పటికీ ఫలితం లేకుండా పోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నుండి ఒక్కొక్కరు కాంగ్రెస్, బీజేపీలోకి వలస వెళ్తుంటే ఏం చేయాలో అర్థంగాని పరిస్థితి నెలకొందని ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు వాపోతున్నారు. తాజాగా మెదక్ ఎంపీ టికెట్టు మొన్నటి వరకు గజ్వేల్‌కు చెందిన వంటేరు ప్రతాప్‌రెడ్డికి కేటాయిస్తారని జోరుగా ప్రచారం సాగినప్పటికీ అనూహ్యంగా మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డికి అధినేత కేసీఆర్ ఖరారు చేయడంతో నిరాశకు గురైన ప్రతాప్‌రెడ్డి పార్టీ మారుతున్నారన్న ప్రచారం సాగుతుంది. మాజీ సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం నుండి ముఖ్యమైన నేత ప్రతాప్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్‌చెరు, నర్సాపూర్, దుబ్బాక నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ప్రచారం ఉంది. ఇందుకు గాను జిల్లాకు చెందిన కాంగ్రెస్ మంత్రితో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. ఓవైపు పార్టీ నేతల వలసలు...మరోవైపు అవినీతి, అక్రమాలపై ఈడీ కేసులతో సతమతవుతున్న తరుణంలో పార్టీ కేడర్‌ను కాపాడుకోవడం ఎలా అనే సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది.
ట్రబుల్ షూటర్ కట్టడి చేసేనా..
ఉద్యమ కాలం నుండి ఉమ్మడి మెదక్ జిల్లాలో అధినేత కేసీఆర్‌కు వెన్నుదన్నుగా ఉండి కష్టకాలంలో పార్టీని గట్టెక్కించి ట్రబుల్ షూటర్‌గా పేరుగాంచిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావుకు ప్రస్తుతం పార్టీ కేడర్‌ను కాపాడడం తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. మెదక్ ఎంపీ టికెట్టును వంటేరు ప్రతాప్‌రెడ్డిని ఒప్పించి వెంకట్రామరెడ్డికి కేటాయించడంలో సఫలమైన హరీష్‌రావు ప్రతాప్‌రెడ్డి పార్టీ మారకుండా ఆపగలరా అనే సంకోచం కలుగుతుంది. అంతేగాకుండా గతకొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్‌ను వీడి పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కాంగ్రెస్, బీజేపీలో చేరుతుండడం, అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం పార్టీ వీడాలని ప్రయత్నాలు సాగిస్తుండడంతో ఏం చేయాలో తెలియని ఆయోమయానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లాకు చెందిన మంత్రి దామోదర రాజనర్సింహ్మతో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని, వీరంతా లోక్‌సభ ఎన్నికలకు ముందే పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. పార్టీని, ఉమ్మడి జిల్లా నాయకులను ఏకతాటిపై నడిపించిన హరీష్‌రావుకు వలసల వ్యవహారం తలనొప్పిగా మారిందని కార్యకర్తలు వాపోతున్నారు.
వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నాయకులు...
ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తుంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా గజ్వేల్ నుండి వంటేరు ప్రతాప్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరతానంటే మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా కాట శ్రీనివాస్‌గౌడ్ వర్గీయులు వ్యతిరేకించడమే కాకుండా పార్టీకి రాజీనామాలు చేస్తామని హెచ్చరించినట్లు సమాచారం. ఇదేకోవలోకి సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గం నుండి కూడా వ్యతిరేకత ఎదురవుతుంది. తాము గత పదేళ్ళుగా పార్టీని నమ్ముకొని కేడర్‌ను కాపాడుకుంటూ కష్టపడ్డామని, తమను విస్మరిస్తే తాము కాంగ్రెస్ పార్టీని వీడతామని కరాఖండిగా తేల్చి చెబుతున్నట్లు సమాచారం. ఏదిఏమైనా బీఆర్ఎస్ నేతల పరిస్థితి అరకత్తెరలో పోక చెక్కలా మారిందని వ్యాఖ్యానిస్తున్నారు.
