పారిశుద్ధ్య కార్మికులందరికీ ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలి

జాతీయ సఫాయి ఖర్మచారి కమిషన్ చైర్మన్ డాక్టర్ పిపి వావాజీ  

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): జిల్లాలోని పారిశుద్ధ్య కార్మికులందరికీ ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కోసం వెంటనే దరఖాస్తు చేయించాలని జాతీయ సఫాయి ఖర్మచారి కమిషన్ చైర్మన్ డాక్టర్ పిపి  వావాజీ అన్నారు.  మంగళవారం సంగారెడ్డి కలెక్టరెట్ సమావేశ మందిరంలో కార్మికుల సమస్యలు తెలుసుకోవడం కోసం జిల్లా స్థాయి అధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలోని అర్హులైన కార్మికులందరికి పీఎఫ్, ఈఎస్ఐ అప్డేట్  చేయాలన్నారు. కోవిడ్ సమయంలో సేవలు అందించిన సఫాయి ఖర్మచారులను ఆయన అభినందించారు. అవుట్ సోర్సింగ్ ద్వారా సకాలంలో జీతాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. సఫాయి ఖర్మచారులకి వెంటనే ఐడెంటిటీ కార్డులను అందజేయాలన్నారు. మూడు నెలలుకు ఒకసారి  ఖర్మచారులకు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. రిటైర్మెంట్ అయిన  ఖర్మచారులకు ఉద్యోగుల బెనిఫెట్స్ పూర్తిగా చెల్లించాలని అధికారులను ఆదేశించారు. కారుణ్య నియామకాలను  పెండింగ్ లో ఉంచొద్దని అధికారులకు సూచించారు. పారిశుద్ధ్య సివరేజ్ పనులు చేస్తూ ప్రమాదాలలో  మరణించిన కార్మికుల కుటుంబాలకు నష్ట పరిహారం  గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం అందించాలన్నారు. అట్రాసిటీ కేసుల వివరాలు కమిషన్కు వెంటనే అందించాలని ఆదేశించారు. అట్రాసిటీ కేసులలో త్వరగా న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. సపోర్టింగ్ స్కీమ్ ల ద్వారా సఫాయి ఖర్మచారులకు బ్యాంక్ రుణాలు ఇవ్వాలన్నారు.   పీఎం ఆవాజ్ యోజన,  ఆయుష్మాన్ భారత్, గృహలక్ష్మి పథకాలలో సఫాయి ఖర్మఛారుల కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలన్నారు.


ఈ కార్యక్రమంలో సలహాదారుడు గీరేందర్నాథ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, సాంఘీక సంక్షేమాధికారి  రామాచారి, సంబంధిత జిల్లా అధికారులు, మునిసిపల్ కమిషనర్లు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

.